అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయానికి వస్తున్న భక్తులు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారు. చలువ పందిర్లు లేని చోట నేల మీద నడవాలంటే భక్తుల కాళ్లు కాలిపోతున్నాయి. భక్తులు కాళ్లు కాలకుండా నేల మీద పరిచేందుకు దేవస్థానం పది ఫుట్ కార్పెట్ బండిల్స్ కొనుగోలు చేసింది. అయితే వాటిని నేల మీద పరచడానికి బదులు పశ్చిమ రాజగోపురం లోపల ఉంచేశారు. ఉదయం పది గంటలకే 30 డిగ్రీల పైబడిన ఉష్ణోగ్రతతో రత్నగిరి ఆలయ ప్రాంగణం వేడెక్కిపోతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో నెల రోజులుగా వందల సంఖ్యలో నవదంపతులు వారి బంధుమిత్రులు సత్యదేవుని ఆలయానికి విచ్చేస్తున్నారు. సంప్రదాయం అనుసరించి చెప్పులు లేకుండానే ఆలయానికి వెడుతున్నారు. వీరంతా సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారి దర్శనం చేసుకుని పశ్చిమ రాజగోపురం వెలుపలకు వచ్చేటప్పటికి నేల కాలిపోయి ఉండడంతో నడవడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది. పశ్చిమ రాజగోపురం ముందు కొంత వరకే కార్పెట్ ఉంది. రాజగోపురం నుంచి అన్నదాన పథకానికి వెళ్లాలంటే తారు రోడ్డుపై నడవాల్సి ఉంది. దీనిపై భక్తులు నడిచేందుకు వీలుగా తెల్లపెయింట్ వేసినా నాలుగు రోజులకే ఆ పెయింట్ వెలిసిపోయి అక్కడ కూడా నడవడానికి ఇబ్బందిగా ఉంటోందని భక్తులు వాపోతున్నారు. పశ్చిమ రాజగోపురం నుంచి అన్నదాన భవనం వరకు, దేవస్థానం బస్సులు ఆగే విశ్రాంతి షెడ్డు వరకు కార్పెట్ వేస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది.
కార్పెట్లు ఉపయోగించండి స్వామీ...!
నేల మీద పరిచే కార్పెట్ బండిల్స్ పది పశ్చిమ రాజగోపురం వద్ద అలంకార ప్రాయంగా పడి ఉన్నాయి. వీటిని భక్తుల కాళ్లు కాలకుండా నేల మీద పరిస్తే ఉపయోగంగా ఉంటుంది. అంతే తప్ప వాటిని సీలు కూడా విప్పకుండా అలా ఉంచితే ఏమి ఉపయోగం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


