రత్నగిరికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

రత్నగిరికి పోటెత్తిన భక్తులు

Apr 6 2026 7:42 AM | Updated on Apr 6 2026 7:42 AM

స్వామిని దర్శించుకున్న 40 వేల మంది

ఆలయ ప్రాకారంలో సత్యదేవుని రథసేవ

అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో పెళ్లి బృందాలతో పాటు, ఆదివారం సహజంగా వచ్చే భక్తులు సుమారు 40 వేల మంది స్వామివారిని దర్శించుకోగా, రెండు వేల వ్రతాలు జరిగాయి. స్వామివారి దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మందికి భోజన సౌకర్యం కల్పించారు.

ఆలయ ప్రాకారంలో ఆదివారం సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పది గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి టేకు రథంపై ప్రతిష్టించి సేవ ప్రారంభించారు. అనంతరం పండితులు వారికి నీరాజనం ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఏఈఓ కృష్ణారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

సత్రం సిబ్బంది నిజాయితీ

సూట్‌కేస్‌లు మరచి వెళ్లిపోయిన పెళ్లి బృందానికి ఆలయ సిబ్బంది వాటిని అప్పగించి నిజాయితీని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే శనివారం రాత్రి విశాఖపట్నానికి చెందిన కోసూరి కేదార్‌నాథ్‌ కుటుంభ సభ్యుల వివాహం రత్నగిరిపై జరిగింది. స్థానిక హరిహర సదన్‌లో వారు రెండు గదులను అద్దెకు తీసుకున్నారు. కాగా, ఆదివారం ఉదయం నవ దంపతులతో బాటు ఆ పెళ్లి బృందం సత్యదేవుని వ్రతం చేయించుకోవడానికి వెళ్లారు. అనంతరం వారు సత్రంలో గదులు ఖాళీ చేసి కౌంటర్‌ వద్ద తాళాలు అప్పగించారు. అనంతరం అక్కడ ఉన్న సత్యదేవుని చిత్రపటానికి నమస్కరించే క్రమంలో రెండు సూట్‌కేసులు అక్కడ ఉంచి మరచి వెళ్లిపోయారు.

సుమారు గంట సేపైనా ఎవరూ ఆ సూట్‌ కేసుల కోసం రాకపోవడంతో కౌంటర్‌ సిబ్బంది సీసీ టీవీ ఫుటేజ్‌ పరిశీలించి పెళ్లి బృందం సభ్యులు వాటిని మరచిపోయినట్టు గుర్తించారు. వాటిని కౌంటర్‌లో భద్రపరిచారు. కాగా కొంత దూరం వెళ్లిన పెళ్లి బృందం వారి సూట్‌ కేసులను మరచిన విషయాన్ని గుర్తించి దేవస్థానానికి ఫోన్‌ చేశారు. దేవస్థానం అధికారులు హరిహర సదన్‌ వద్ద రెండు సూట్‌కేసులు మరచిపోయారని వాటి వివరాలు చెప్పి తీసుకువెళ్లాలని చెప్పారు. దీంతో వారు తిరిగి సత్రానికి చేరుకుని సూట్‌కేసుల వివరాలు చెప్పగా అధికారులు వాటిని వారికి అందచేశారు. సత్రం గుమస్తా సుంకర వేంకటేష్‌, ఇతర సిబ్బందిని పెళ్లి బృందం సభ్యులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement