అయినవిల్లి: మండలంలోని అయినవిల్లిలంక పంచాయతీ పరిధిలో కోటిపల్లి భాగ వద్ద ఇటుకబట్టీల కోసం తవ్విన గోతుల్లో మొసళ్లు ఉన్నాయని ఐదు నెలల క్రితం వచ్చిన వార్త సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. స్థానికులు దాని ఆచూకీ చెప్పడంతో ఆదివారం జిల్లా అటవీ అధికారి ఎంవీ ప్రసాదరావు నేతృత్వంలో అధికారుల బృందం దానిని పట్టుకుని ఆరోగ్య పరీక్షలు చేశారు. అది ఆరోగ్యంగా ఉందని ధ్రువీకరించారు. దానిని మారేడుమిల్లి అడవులలో వదలిపెడతామని ప్రసాదరావు తెలిపారు. మొసలిని పట్టుకోవడంలో అధికారులు కె.రాంబాబు, నాగ సత్యనారాయణ, డీఎన్ మూర్తి తదితరులు సహకరించారన్నారు. ఇది ఇలా ఉండగా మొసలిని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు.
దండంగి వాగు వద్ద పెద్దపులి
దేవీపట్నం: రెండు నెలలకు పైగా అటవీ అధికారులకు చుక్కలు చూపిస్తున్న పెద్దపులి శుక్రవారం రాత్రి సీతానగరం మండలం పెద కొండేపూడి వైపు నుంచి నేలకోట రామదుర్గం మీదుగా నాగళ్లపల్లి పూడిపల్లి గ్రామాల మధ్య తిష్ట వేసింది. శనివారం రాత్రి దండంగి వద్దకు చేరుకుని రెండు పశువులను చంపి తినేసింది. ఆదివారం సాయంత్రం దండంగి వాగు వద్ద ఉన్నట్లు జీపీఎస్ ట్రాకర్ ద్వారా అటవీ అధికారులు గుర్తించారు. ఆదివారం రాత్రికి దండంగి వాగు దాటి దేవీపట్నం వైపు పయనిస్తే పెద్దపులి రక్షిత అటవీ ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉంది. దండంగి పూడిపల్లి ప్రాంతంలో సమృద్ధిగా నీరు, వేటాడేందుకు విడిచిపెట్టిన పశువులు అధికంగా ఉండడంతో ఇక్కడే స్థిరపడిపోతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉండగా పులికి మత్తుమందు ఇచ్చి పట్టుకునేందుకు అటవీ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు.
అదుపు తప్పి లారీ బోల్తా
రంపచోడవరం: రాజమహేంద్రవరం నుంచి బొడ్లంకకు సెంట్రింగ్ లోడుతో వెళ్లుతున్న లారీ ఆదివారం మధ్యాహ్నం అదుపు తప్పి పడిపోయింది. లారీ యాక్సిల్ విరిగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈతలపాడు సమీపంలో అప్ ఎక్కుతుండగా ఒక్కసారిగా లారీ అదుపు తప్పి వెనక్కి వెళ్లి తిరగబడింది. దీంతో లారీపై ఉన్న ఇద్దరు వ్యక్తులు, డ్రైవర్లు లారీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
నేటి నుంచి పంచాయతీ
కార్యదర్శులకు శిక్షణ
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు ఉన్న జిల్లాలతో పాటు పోలవరం జిల్లా కలిపి 12 జిల్లాల్లోని గ్రేడ్ 4, 5 పంచాయతీ కార్యదర్శులకు సోమవారం నుంచి శిక్షణ ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్‌వీ ప్రసాదరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 12 జిల్లాల నుంచి 2,300 మందికి, 11 బ్యాచ్‌లలో శిక్షణ ఉంటుందన్నారు. ప్రతి బ్యాచ్‌లో 225 మందికి ఆరు రోజుల పాటు భోజన, వసతితో కూడిన శిక్షణ ఉంటుందని తెలిపారు. ఏపీఎస్‌ఐఆర్‌డీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలిపారు.


