పిచ్చుకలంక ఘటనలో ఇద్దరి మృతదేహాలు లభ్యం | - | Sakshi
Sakshi News home page

పిచ్చుకలంక ఘటనలో ఇద్దరి మృతదేహాలు లభ్యం

Apr 6 2026 7:42 AM | Updated on Apr 6 2026 7:42 AM

రాజమహేంద్రవరం రూరల్‌/ఆత్రేయపురం: అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక శివారు పిచ్చుకలంక వద్ద బ్యారేజీ దిగువన గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతై మృత్యువాతపడిన తుమ్మలావకు చెందిన అబిద్‌, ఆర్ఫాద్‌ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. నలుగురు స్నేహితులతో కలిసి గోదావరిలో శనివారం మధ్యాహ్నం ఈతకు వెళ్లిన వారిలో మణికంఠ సురక్షితంగా బయటపడగా జాంపేటకు చెందిన షేక్‌ బిలాల్‌, తుమ్మలావకు చెందిన వరుసకు సోదరులైన అబిద్‌, అర్ఫాద్‌లు గల్లంతైన విషయం తెలిసిందే. షేక్‌ బిలాల్‌ మృతదేహం వెంటనే లభించగా, ఆదివారం ఉదయానికి సుల్తాన్‌ అహ్మద్‌ (22), అర్ఫాద్‌ (18) మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్రేయపురం పోలీసులు రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆత్రేయపురం తహసీల్దార్‌ ఆర్డీ రామచంద్రమూర్తి, పోలీస్‌ ఏఎస్‌ఐ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. తుమ్మలావకు చెందిన అహ్మద్‌ తండ్రి చిన్నప్పుడే మృతిచెందాడు. అన్న హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కకు పెళ్లయ్యింది. ఇంటి వద్ద తల్లికి చేదోడువాదోడుగా ఉంటున్న అహ్మద్‌ బీటెక్‌ చదువుతున్నాడు. చేతికి అందివచ్చే సమయంలో అతడు మృతి చెందడంతో తల్లి రోదిస్తున్న తీరు చూపరునుల కంటతడి పెట్టిస్తోంది. అర్ఫాద్‌ ఇటీవలే ఇంటర్మీడియెట్‌ పరీక్షలు రాసి ఎంసెట్‌కు సిద్ధమవుతున్నాడు. ఈ సమయంలో కుమారుడు మృత్యువాత పడడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు.

తుమ్మలావలో విషాదఛాయలు

Advertisement
 
Advertisement
Advertisement