సామర్లకోట: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం, జి.మేడపాడు గ్రామంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఒక మహిళ మృతి చెందిన ఘటనలో పోలీసులు ఆదివారం ఐదుగురిని అరెస్టు చేశారు. సీఐ ఎ.కృష్ణభగవాన్ కథనం మేరకు మేడపాడు పాలబండ వీధిలో నివసిస్తున్న మదిన, బొద్దపు కుటుంబాల మధ్య కొంత కాలంగా ఇంటికి సంబంధించి వివాదం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ నెల రెండో తేదీ రాత్రి జరిగిన చిన్న సంఘటన ఆధారంగా మదీనా కుటుంబ సభ్యులపై బొద్దపు కుటుంబ సభ్యులు కళ్లలో కారం చల్లి, కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో మదిన లోవలక్ష్మికి బలమైన కత్తి దెబ్బ తగలడంతో కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దాంతో ఆమె కుమార్తె హారిక ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు ఆదివారం మాధవపట్నం శివారులో సర్పవరం రైల్వేస్టేషన్ దగ్గరలో ముద్దాయిలను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. వీరిలో ఎ1గా బొద్దపు ఆదిత్య వినయకుమార్, ఎ2గా బొద్దపు శ్రీనివాసరావు, ఎ3గా బొద్దపు భవానీ, ఎ4గా బొద్దపు నూకరత్నం. ఎ5గా బొద్దపు లలిత సౌమ్యలను అరెస్టు చేసి ఆదివారం కోర్టుకు పంపినట్టు తెలిపారు. 2020 నుంచి ఇరు వర్గాల మధ్య పరస్పర దాడులపై కేసులు కోర్టులో విచారణలో ఉన్నాయని సీఐ తెలిపారు.


