స్వామిని చూసి.. మైమరచి | - | Sakshi
Sakshi News home page

స్వామిని చూసి.. మైమరచి

Apr 4 2026 7:43 AM | Updated on Apr 4 2026 7:43 AM

సత్యదేవుని సన్నిధికి భారీగా భక్తులు

ఒక్కరోజే రూ.30 లక్షల ఆదాయం

అన్నవరం: ఆ సత్యదేవుని చూసిన ప్రతి మదీ పులకించింది.. తన్మయత్వంలో ఓలలాడింది.. శుక్రవారం అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం వేలాదిగా వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. సత్యదేవుని సన్నిధిలో, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారు జామున వివాహాలు జరగడంతో నవ దంపతులు, వారి బంధుమిత్రులతో సందడి నెలకొంది. ఈ ఒక్కరోజే సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని వ్రతాలు 1,500 జరిగాయి. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్త గోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. కాగా, శని, ఆదివారాలు కూడా రత్నగిరిపై భక్తుల రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఘనంగా చండీ హోమం

రత్నగిరిపై వనదుర్గమ్మ వారికి చండీ హోమం నిర్వహించారు. అనంతరం గుండంలో హోమ ద్రవ్యాలను సమర్పించి పూర్ణాహుతి జరిపారు. తరువాత అమ్మవార్లకు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. వనదుర్గమ్మ ఆలయ అర్చకుడు ప్రయాగ రాంబాబు, పరిచారకులు చిట్టెం వాసు, వేణు, వ్రత పురోహితులు చెల్లపిళ్ల ప్రసాద్‌, కూచుమంచి ప్రసాద్‌ తదితరులు హోమం నిర్వహించారు. ఈ హోమంలో రూ.750 టిక్కెట్‌తో 45 మంది భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుని ప్రధానాలయంలో దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నర్శింహమూర్తి ఆధ్వర్యంలో కుంకుమ పూజలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement