లొల్ల లాకుల ఆధునీకరణకు 74.20 కోట్లు మంజూరు
ఆత్రేయపురం: మధ్య డెల్టా పరిధిలోని లొల్ల లాకుల ఆధునీకరణకు ఎట్టకేలకు ప్రభుత్వం రూ.74.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.సాయి ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ లాకుల అధ్వాన పరిస్థితిపై గత నెల 10న పా‘లాకులు’ పట్టించుకోక అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో లొల్ల లాకులను వెంటనే పునర్నిర్మించాలని ప్రభుత్వంపై జిల్లా ప్రాజెక్టు కమిటీ ఒత్తిడి తెచ్చింది. లొల్ల లాకులు ఆధునీకరణకు రూ.74.20 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు శుక్రవారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఓ ప్రకటన విడుదల చేశారు. మధ్య డెల్టా ప్రధాన కాలువ 13.200 కిలోమీటరు వద్ద లొల్ల, ర్యాలి వేర్, లాక్స్, ఇప్పటికే ఉన్న లాక్స్, వేర్లు, వంతెనల దిగువ భాగంలో డీఎల్‌ఆర్బీ పునర్నిర్మాణానికి పరిపాలన అనుమతి మంజూరు చేసింది. లొల్ల లాకుల నుంచి అమలాపురం బ్యాంకు కాలువ, అమలాపురం కాలువ, గన్నవరం కాలువల పునర్నిర్మాణం ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు సజావుగా సాగునీరు అందించే పనులతోపాటు అమలాపురం బొబ్బర్లంక రోడ్డులో లొల్ల లాకుల సమీపంలో బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యాయి.


