రానూ.. రాజమండ్రి రాను
● లోకేష్ పర్యటన మూడుసార్లు వాయిదా
● స్థానిక టీడీపీ నేతలపై మితిమీరిన
అవినీతి ఆరోపణలు
● అందుకే ఇక్కడకు వచ్చేందుకు
ఆసక్తి చూపడం లేదని చర్చ
● విదేశీ పెట్టుబడుల కోసం
వెళ్లారంటూ టీడీపీ కవరింగ్
సాక్షి, రాజమహేంద్రవరం: ‘రానూ బొంబాయికి రాను’ అనే పాట మాదిరిగానే.. సీఎం చంద్రబాబు తనయుడు, రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘రానూ రాజమండ్రి రాను’ అంటున్నట్టున్నారు. ఆయన రాజమహేంద్రవరం పర్యటన పదేపదే వాయిదా పడటం నగరంలో చర్చనీయాంశంగా మారింది. నగరంలోని టీడీపీ నేతలపై పలు అవినీతి ఆరోపణలు వస్తున్నందువల్లనే ఇక్కడకు వచ్చేందుకు ఆయన విముఖత చూపుతున్నారా.. నేరారోపణలు ఎదుర్కొంటున్న నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టిన తంతుపై ఇతర నాయకులు నిలదీస్తారని భావిస్తున్నారా.. ఈ విషయం ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారా.. ఇందులో భాగంగానే ఆయన రాజమహేంద్రవరం పర్యటన విరమించుకున్నారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి. ఇప్పటికే ఆయన పర్యటన మూడుసార్లు వాయిదా పడింది. ఇకనైనా వస్తారా.. మిన్నకుండిపోతారా.. అనే మీమాంస ఆ పార్టీ శ్రేణల్లో నెలకొంది.
ముచ్చటగా మూడుసార్లు
చారిత్రక రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో నిర్మించిన ప్రవేశ ద్వారం, నూతన భవనాల ప్రారంభోత్సవానికి లోకేష్ వస్తారని కొన్నాళ్ల కిందట విస్తృత ప్రచారం చేశారు. ఆర్ట్స్ కళాశాల విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి సైతం ఏర్పాటు చేశారు. ఇదిగో రేపు వచ్చేస్తారంటూ ఎమ్మెల్యే, టీడీపీ నేతలు నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టేశారు. వారి హడావుడిపై నీళ్లు జల్లినట్టుగా లోకేష్ పర్యటన ఒక్కసారిగా వాయిదా పడింది. రెండు రోజుల అనంతరం మళ్లీ రేపు వచ్చేస్తారంటూ హడావుడి చేశారు. అప్పుడు కూడా ఆయన డుమ్మా కొట్టారు. మూడోసారి కచ్చితంగా వస్తారంటూ మరోసారి ప్రచారం చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కళాశాల ప్రవేశ ద్వారం లోగోను సైతం వస్త్రంతో కప్పేశారు. లోకేష్ వచ్చి ప్రారంభించిన అనంతరం దానిని తీయాలనుకున్నారు. కానీ, షరా మామూలుగానే ఆయన ముఖం చాటేశారు. ఇలా ప్రతిసారీ వస్తారని ఆశించడం.. భంగపాటు ఎదురవడం పరిపాటిగా మారింది. గడచిన రెండు నెలలుగా లోకేష్ నగర పర్యటన మూడుసార్లు వాయిదా పడింది. దీనికి నగర టీడీపీలో నెలకొన్న పరిస్థితులే కారణమన్న చర్చ జరుగుతోంది.
అవినీతే కారణమా?
రాష్ట్ర అభివృద్ధి, విదేశీ పెట్టుబడుల కోసం పర్యటిస్తున్న కారణంగానే లోకేష్ రాజమహేంద్రవరం రాలేకపోతున్నారని టీడీపీ శ్రేణులు కవరింగ్ ఇస్తున్నాయి. అయితే దీని వెనుక వేరే విషయం ఉందని కూడా పలువురు అంటున్నారు. ముఖ్యంగా స్థానిక టీడీపీ నేతలపై అవినీతి, అక్రమాలు, ఆడియో టేపుల్లో బహిరంగంగా దొరికిపోవడం వంటి కారణాలున్నాయనే ఆరోపణలున్నాయి. నగర పర్యటనకు వస్తే.. నేతల అవినీతి ఆరోపణలపై నిలదీస్తారనే ఉద్దేశంతోనే లోకేష్ ఇక్కడకు వచ్చేందుకు సుముఖత చూపడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది.
వరుస ఆరోపణలు
● లిక్కర్ వ్యవహారంలో అధికారులకు మామూళ్లు ఇవ్వాలంటూ టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఓ మద్యం దుకాణం నిర్వాహకుడితో జరిపిన సంభాషణ ఆడియో సంభాషణలు బహిర్గతమవడం తీవ్ర దుమారం రేపింది.
● ఇది జరిగిన కొద్ది రోజులకే అదే మద్యం వ్యవహారంలో జరిగిన సంభాషణకు సంబంధించి టీడీపీలో మరో కీలక నేత కిలపర్తి శ్రీనివాస్ ఆడియో సంభాషణలు సైతం సామాజిక మాధ్యమాల్లో కలకలం రేపాయి.
● అవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారు చేసినవని, తమ వాయిస్ కాదని టీడీపీ నేతలు వివరణ ఇచ్చినా ప్రజలు విశ్వసించలేదు.
● ఆ ఆడియో సంభాషణలను బయట పెట్టింది సైతం మరో టీడీపీ నాయకుడే కావడం గమనార్హం.
● దేవదాయ, ధర్మాదాయ శాఖలో ఇటీవల చేపట్టిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ల నియామకం సైతం వివాదాస్పదంగా మారింది. నగరంలో పేకాట క్లబ్బుల నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నేతను ప్రముఖ దేవస్థానం చైర్మన్‌గా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
● స్థానిక శ్రీరామ్ నగర్‌లోని ఓ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చెయ్యి విరగ్గొట్టిన కేసులో ఉన్న వ్యక్తిని మరో ముఖ్యమైన దేవస్థానం చైర్మన్‌గా నియమించారు.
● గతంలో రౌడీ షీటర్‌గా ఉన్న టీడీపీ సిటీ మాజీ అధ్యక్షుడికి ప్రముఖ సత్రం చైర్మన్ పదవి కట్టబెట్టారు.
● ఇంకా పలు ట్రస్ట్ బోర్డులకు డైరెక్టర్లుగా సైతం వివిధ నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని నియమించారనే ఆరోపణలున్నాయి.
● ఇలా పవిత్రమైన ఆలయాల చైర్మన్, ఇతర పదవులను నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి కట్టబెట్టడంపై భక్తులు, ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.
● నామినేటెడ్ నియామకాలు, మద్యం, ఇసుకలో టీడీపీ నేతలు పాల్పడుతున్న అవినీతి ఆరోపణలపై ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి సమగ్ర సమాచారం అందజేసినట్లు తెలిసింది. ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ల నేరారోపణలపై సైతం స్పష్టమైన నివేదికలు ఇచ్చినట్లు సమాచారం.
నోరు మెదపని బీజేపీ
ఆలయాల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని గట్టిగా వాదించే బీజేపీ నేతలు సైతం ఈ నియామకాలపై నోరు మెదపకపోవడమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. కొందరు బీజేపీ నేతలు సైతం పదవులు పొందినట్లు సమాచారం. ఈ విషయాలు తెలియకుండానే బీజేపీ నేతలు ట్రస్ట్ బోర్డ్ పదవులు తీసుకున్నారా.. లేక తెలిసి కూడా కూటమిలో భాగం కాబట్టి చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారా.. అనే విమర్శలు వస్తున్నాయి. ఈ వ్యవహారాలే లోకేష్ పర్యటన రద్దుకు కారణమని ప్రతిపక్షం సైతం ఆరోపించడం రాజమహేంద్రవరంలో చర్చనీయాంశంగా మారింది. లోకేష్ పర్యటన ఈ కారణాలతోనే వాయిదా పడుతోందా.. లేక వ్యూహాత్మకమా అనే చర్చ నడుస్తోంది.


