ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

Dec 12 2025 6:43 AM | Updated on Dec 12 2025 6:43 AM

ఎరువు

ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

జిల్లాలో 7,599 మెట్రిక్‌ టన్నుల యూరియా

జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు

దేవరపల్లి: జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, కృత్రిమ కొరత సృష్టించినా, మళ్లించినా, ఎక్కువ ధరకు విక్రయించినా డీలర్ల లైసెన్సులు రద్దు చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌. మాధవరావు హెచ్చరించారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రబీ పంటలకు అవసరమైన ఎరువులను సొసైటీలు, ప్రైవేటు డీలర్ల వద్ద సిద్ధంగా ఉంచామని తెలిపారు. జిల్లాలో 59 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా పంపిణీకి ప్రణాళిక రూపొందించామన్నారు. అక్టోబర్‌ 1 నాటికి 34 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలున్నాయని చెప్పారు. అకోబర్‌ 1 నుంచి ఈ నెల 1 వరకూ జిల్లాకు మొత్తం 26.9 వేల మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా, ఇప్పటికే 17.9 వేల మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంచామని వివరించారు. ఇప్పటి వరకూ 13.1 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా విక్రయాలు జరిగాయని, ఈ నెలాఖరుకు మరో 9 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా రానుందని తెలిపారు. రానున్న 21 రోజులకు 61 వేల మెట్రిక్‌ టన్నులు అవసరం కాగా, ప్రస్తుతం 89 వేల మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉందని చెప్పారు. నానో యూరియా, నానో డీఏపీ కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. ఎంఆర్‌పీ ప్రకారమే ఎరువులకు ధర చెల్లించాలని, డీలర్‌ నుంచి తప్పనిసరిగా రశీదు పొందాలని రైతులకు మాధవరావు సూచించారు.

నేటి నుంచి ఢిల్లీ విమానం

కోరుకొండ: ఢిల్లీ – రాజమహేంద్రవరం మధ్య నడిచే ఇండిగో విమాన సర్వీసు శుక్రవారం నుంచి యథాతథంగా అందుబాటులోకి వస్తుందని రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ ఎన్‌కే శ్రీకాంత్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే మిగిలిన సర్వీసులన్నీ షెడ్యూల్‌ ప్రకారం నడుస్తున్నాయన్నారు. హైదరాబాద్‌, చైన్నె, బెంగళూరు, ఢిల్లీకి ఇండిగో సర్వీసులు 9 ఉన్నాయి. వీటితో పాటు ముంబై – రాజమండ్రి విమానం వీక్లీ సర్వీసుగా ఉందన్నారు. అలాగే, అలయన్స్‌ సంస్థకు చెందిన విమానం తిరుపతికి వీక్లీ సర్వీసుగా నడుస్తోందని శ్రీకాంత్‌ తెలిపారు.

వేతనాలు చెల్లించాలని

జేసీకి వినతి

తాళ్లపూడి: తమకు గౌరవ వేతనం బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ తాళ్లపూడి మండల ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ మేఘాస్వరూప్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నేటి వరకూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు గౌరవ వేతనం చెల్లించడం లేదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జొన్నకూటి పోసిరాజు, మండల సర్పంచ్‌ల చాంబర్‌ అధ్యక్షుడు కొమ్మిరెడ్డి పరశురామారావు, గజ్జరం, వేగేశ్వరపురం ఎంపీటీసీ సభ్యులు గుంటు చిన్నబ్బాయి, లక్ష్మణరావు పాల్గొన్నారు. దీనిపై జేసీ మేఘాస్వరూప్‌ తక్షణం స్పందించారు. వివరాలు అడిగి తెలుసుకుని, వేతనాలు త్వరగా వచ్చేలా చూడాలని జెడ్పీ సీఈఓను ఆదేశించారు.

ఉద్యోగాల భర్తీకి

నోటిఫికేషన్‌

కాకినాడ క్రైం: వైద్య, ఆరోగ్య శాఖ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో వివిధ కేడర్లకు చెందిన 35 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు డీఎంహెచ్‌ఓ నరసింహ నాయక్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ 3, ఆడియో మెట్రీషియన్‌ 4, టీబీ హెల్త్‌ విజిటర్‌ 5, ఫార్మసిస్ట్‌ 3, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ 3, సీనియర్‌ ట్రీట్‌మెంట్‌ సూపర్‌వైజర్‌ 3, జిల్లా ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ 2, పబ్లిక్‌ అండ్‌ ప్రైవేట్‌ మిక్స్‌ కో ఆర్డినేటర్‌ ఫర్‌ టీబీ 1, అకౌంటెంట్‌ 2, డ్రగ్‌ రెసిస్టెంట్‌ టీబీ కౌన్సిలర్‌ 1, ఎల్‌జీఎస్‌ 8 పోస్టులను నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌ పరిధిలో కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయనున్నామని వివరించారు. దరఖాస్తు డౌన్‌లోడ్‌, ఇతర వివరాలకు ఆయా జిల్లాల అభ్యర్థులు eastgodavari.ap.gov.in, kakinada. ap.gov.in, konaseema.ap.gov.in వెబ్‌సైట్లను సందర్శించాలని సూచించారు. ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకూ కాకినాడ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో దరఖాస్తులు అందించాలని తెలిపారు.

ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు 1
1/1

ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement