కోనసీమపై చలి పంజా.. | - | Sakshi
Sakshi News home page

కోనసీమపై చలి పంజా..

Dec 12 2025 6:43 AM | Updated on Dec 12 2025 6:43 AM

కోనసీ

కోనసీమపై చలి పంజా..

కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీల నమోదు

గజగజలాడుతున్న జిల్లా ప్రజలు

ఉదయం 8 దాటినా వీడని మంచు తెరలు

ఐ.పోలవరం: చలి పులి పంజాకు కోనసీమ ప్రజలు గజగజలాడుతున్నారు. జిల్లాలో గురువారం 27 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు పడిపోయాయి. నాలుగు రోజులుగా గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున మూడు డిగ్రీల చొప్పున పడిపోతున్నాయి. ఉత్తర భారతం నుంచి వస్తున్న చలి గాలులతో ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రాత్రి 8 గంటలకే పట్టణాలు, గ్రామాలు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. తెల్లవారుజామున మంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 8 గంటలు దాటినా మంచు తెరలు వీడడం లేదు. మరోవైపు ఈ వాతావరణం శీతల రోగాలకు, వ్యాధులకు కారణమవుతోంది. దట్టంగా కమ్ముకుంటున్న మంచులో తిరుగుతున్న వారు జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఈ సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నారు. సాధ్యమైనంత వరకూ మంచులో తిరగవద్దని వైద్యులు సూచిస్తున్నారు. పొద్దు పొడవక ముందే పనులకు వెళ్లాల్సిన వారు ముందున్న దారి కనపడక తమ వాహనాలను అత్యంత నెమ్మదిగా నడుపుతూ ముందుకు సాగుతున్నారు. ఈ వాతావరణం వల్ల ఖరీఫ్‌ కోతలు, రబీ సాగు నారుమడులకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఉదయం 9 గంటలైతే తప్ప వరి చేలల్లో పనులకు కూలీలు ఉపక్రమించడం లేదు. ఈ పరిస్థితి రైతులకు కాస్త ఇబ్బందిగా మారుతోంది.

ఉదయం పూట దట్టంగా కమ్ముకుంటున్న మంచులో సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వాకింగ్‌ చేయడం వలన పలు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఉదయం నడిచే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. తెల్లవారు జామున వాకింగ్‌ మంచిదే అయినా సరైన రక్షణ చర్యలు తీసుకోకుండా మంచులో తిరగొద్దని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చలి వాతావరణంతో గుండె సమస్యలు పెరుగుతాయని, గుండైపె ఒత్తిడి పెంచి, గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉండవచ్చని వారు సూచిస్తున్నారు. దీనితో పాటు శ్వాసకోశ సమస్యలు కూడా రావచ్చు. పలువురికి ఆస్తమా లేదా బ్రాంకైటిస్‌ వంటి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. మంచులో నడకకు వెళ్లేవారు వెచ్చని దుస్తులు ధరించాలని, వీలైతే, సూర్యరశ్మి భూమికి తాకే సమయంలో నడవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

మంచులోనే మార్నింగ్‌ వాక్‌

కోనసీమపై చలి పంజా..1
1/1

కోనసీమపై చలి పంజా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement