 
															లోకాన్ని వీడినా వెలుగులు పంచి..
● రోడ్డు ప్రమాదంలో యువకుడు బ్రెయిన్ డెడ్
● అవయవాలను దానం చేసిన తల్లిదండ్రులు
కాకినాడ రూరల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ చెందిన యువకుడు అవయవదానంతో పలువురి జీవితాల్లో వెలుగులు నింపాడు. వివరాల్లోకి వెళితే.. అమలాపురానికి చెందిన జి.మహేష్ (23) ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని మెరుగైన వైద్యం కోసం కాకినాడ అచ్చంపేట జంక్షన్‌లోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. మహేష్‌ను బతికించేందుకు వైద్యులు ఎంత ప్రయత్నించినా స్పందించలేదు. దీంతో బ్రెయిన్ డెడ్ చెందినట్టు మరుసటి రోజు వైద్యులు ప్రకటించారు. మహేష్ అవయవాలను దానం చేయడానికి అతడి తల్లిదండ్రులు సమ్మతించారు. దీంతో మెడికవర్ అస్పత్రిలో అవయవ సేకరణ నిర్వహించారు. కాకినాడ ప్రభుత్వాస్పత్రి ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యుడు ఫి.ఫణికిరణ్ పర్యవేక్షణలో డాక్టర్లు కళ్యాణ్ బాబు, రాజా అమరేంద్ర, కిశోర్ బాబు, అరవింద్, మెడికవర్ ట్రాన్స్‌ప్లాంట్ టీమ్ సమన్వయంతో రెండు కిడ్నీలు, రెండు కళ్లు సేకరించారు. కళ్లను బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్‌కు, రెండు కిడ్నీలను కాకినాడ నగరం, రూరల్‌లోని రెండు ఆస్పత్రిలో రోగులకు అమర్చేందుకు గ్రీన్ చానల్ ద్వారా మంగళవారం అర్ధరాత్రి తరలించారు. ఈ సందర్భంగా అవయదాన్ ప్రతినిధి కె.రాంబాబు మాట్లాడుతూ అవయవదానం అనేది జీవితానికి పరమార్థం లాంటిదని, ఒకరి జీవిత ప్రయాణం ముగిసినా అవయవాలు మరెందరికో కొత్త శ్వాసగా మారుతాయన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ సెంటర్ హెడ్ శుభాకరరావు మాట్లాడుతూ అవయవ దానం చేసేందుకు ముందుకు వచ్చిన మహేష్ కుటుంబ సభ్యులు అభినందనీయులన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
