 
															ఫ్రిడ్జి పేలుడుతో కలకలం
అనపర్తి: కొత్తూరు జగనన్న కాలనీలోని ఓ ఇంట్లో బుధవారం ఫ్రిడ్జి పేలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు, ఫైర్ ఆఫీసర్ జీరి శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన కుక్కల దుర్గాభవాని అనపర్తిలోని బ్యాంకు పని చేస్తుంటారు. ఆమె బుధవారం యథావిధిగా విధులకు వెళ్లారు. ఇద్దరు ఆడపిల్లలూ ఆడుకోవడానికి బయటకు వచ్చారు. ఆ సమయంలో ఇంట్లోని ఫ్రిడ్జి పెద్దశబ్దంతో పేలిపోయింది. ఈ ప్రమాదంలో పక్కనే ఉన్న ఇన్వర్టర్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే రెండు గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ.1 లక్ష విలువైన గృహోపకరణాలు పాడైపోయాయని ఎస్‌ఎఫ్‌వో శ్రీనివాసరెడ్డి తెలిపారు. కాగా.. వర్షంతో పాటు కాలనీలోని రోడ్లు పూర్తిగా ఛిద్రం కావడంతో అగ్నిమాపక వాహనం ప్రమాద స్థలానికి రాలేకపోయింది. దీంతో సిబ్బంది అతి కష్టంతో పాత్రికేయుల ద్విచక్ర వాహనాలపై అగ్ని నిరోధక పరికరాలు తీసుకుని వచ్చి మంటలను అదుపు చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
