 
															తుపాను బాధితులకు ‘వాడపల్లి’ భోజనం
కొత్తపేట: ఆత్రేయపురం మండల పరిధిలో ఏర్పాటు చేసిన తుపాను పునరావాస కేంద్రాల్లోని నిర్వాసితులకు వాడపల్లి శ్రీ భూ సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి అన్న ప్రసాదం (భోజన సదుపాయం) వితరణ చేస్తున్నారు. మోంథా తుపాను కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానం కూడా అండగా నిలిచింది. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఈ నెల 27 నుంచి మధ్యాహ్నం, రాత్రి భోజనాలను పునరావాస కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. మండల పరిధిలోని వివిధ కేంద్రాల్లో సుమారు వెయ్యి మందికి అందిస్తున్నారు.
ఈదురు గాలులకు టెంట్లు ధ్వంసం
తుపాను కారణంగా వీచిన ఈదురు గాలులు, కురిసిన భారీ వర్షాలకు వాడపల్లి దేవస్థానానికి ఒక మోస్తరు నష్టం వాటిల్లింది. ఏడు వారాలు ప్రదక్షిణలు చేసే మాడ వీధుల్లో భక్తుల కోసం ఏర్పాటు చేసిన ఐరన్ పైపుల క్లాత్ టెంట్లు ధ్వంసమ య్యాయి. వాటిని డీసీ, ఈఓ చక్రధరరావు పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా వెంటనే పునరుద్ధరించాలని సిబ్బందికి ఆదేశించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
