 
															వీడియో వైరల్ బాధ్యులపై కఠిన చర్యలు
తుని రూరల్: బాలికపై వృద్ధుడు లైంగిక దాడికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా, ఇతరేతర మీడియాల్లో వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తుని రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.చెన్నకేశవరావు హెచ్చరించారు. గురువారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. సోషల్ మీడియా అకౌంట్లలో నిక్షిప్తం చేసిన వీడియోలను సాయంత్రం ఐదు గంటల్లోగా తొలగించాలని సూచించారు. సంబంధిత వీడియోలపై సమగ్ర పరిశీలన జరుగుతుందన్నారు. హంసవరం కేంద్రంగా వీడియోలు వైరల్ అవుతున్నాయన్నారు. తమ బృందాలు ఇప్పటికే అటువంటి గ్రూపులు, వ్యక్తులను గుర్తించాయన్నారు. దీనిపై పోక్సో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. బాధితురాలితో పాటు నిందితుడు తాటిక నారాయణరావు ఉన్న వీడియోలను ఎవరైనా సోషల్ మీడియాలో పెట్టి ఉంటే తీసివేయాలన్నారు. ఈ వీడియోలతో తమ గౌరవానికి భంగం వాటిల్లుతుందని నిందితుడు నారాయణరావు కుటుంబ సభ్యులు మనస్థాపానికి గురవుతున్నారన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ సీఐ గీతా రామకృష్ణ, ఎస్సైలు పాల్గొన్నారు.
బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి
రావులపాలెం: స్థానిక హైవేపై ఆర్టీసీ ఇన్‌గేట్ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన అడపాల కోటమ్మ (61) తన సొంత పనిపై రావులపాలెం వచ్చింది. పని ముగించుకుని స్వగ్రామం వెళ్లేందుకు హైవేపై బస్టాండ్ ఇన్‌గేటు వద్ద రోడ్డు దాటుతుంది. ఈ నేపథ్యంలో తణుకు వైపు నుంచి రావులపాలెం బస్టాండ్‌కు వస్తున్న భీమవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును డ్రైవర్ అజాగ్రత్తగా నడుపుతూ కోటమ్మను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. మృతురాలి మనవడు ఉండవల్లి దుర్గాప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై జి.చంటి కేసు నమోదు చేశారు.
27న నిధి ఆప్‌కే నికట్
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) ప్రాంతీయ కార్యాలయం పరిధిలో ఈ నెల 27న ఉదయం 9 గంటల నుంచి నిధి ఆప్‌కే నికట్– డిస్ట్రిక్ట్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ రాధానాథ్ పట్టానాయక్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లాకు ఈతకోటలో వీవీఎస్ సుబ్బరాజు, ఎన్‌ఏసీఎల్ కాంట్రాక్టర్‌లోనూ, కాకినాడ జిల్లాకు ఎ.అన్నవరంలో శ్రీశారదా ఎడ్యుకేషనల్ సొసైటీలో, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు అమలాపురం భట్లపాలెంలో బీవీసీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో, ఏలూరు జిల్లాకు గుండుగొలను నాగహనుమాన్ సాల్వెంట్స్‌లో, పశ్చిమగోదావరి జిల్లాకు వేండ్రంలో వెల్కమ్ ఫిషరీస్ లిమిటెడ్‌లో, అల్లూరి సీతారామరాజు జిల్లాకు రంపచోడవరంలో గిరిజన కో–ఆపరేటివ్ కార్పొరేషన్‌లో నిధి ఆప్‌కే నికట్ డిస్ట్రిక్ట్ ఔట్‌రీచ్ ప్రోగ్రామ్ జరుగుతుందని వివరించారు. ఈసీఆర్, రిటర్న్‌పై అవగాహన, కొత్తగా చేరిన ఉద్యోగులకు ఇవాల్సిన ముఖ్య సూచనలు, అడ్వాన్సుల రకాలు, అడ్వాన్సుల దాఖలు చేయడానికి అవసరాలు, పోర్టల్స్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా అడ్వాన్సులను ఎలా దాఖలు చేయాలో, క్లెయిమ్ తిరస్కరణ కారణాలు, దాఖలు చేసినప్పుడు చేసే సాధారణ తప్పులపై అవగాహన కల్పిస్తారన్నారు. పీఎఫ్ సభ్యులు, పింఛనుదారులు, ఎస్టాబ్లిష్‌మెంట్‌లు, కొత్తగా కవర్ చేయబడిన ఎస్టాబ్లిష్‌మెంట్‌లు వినియోగించుకోవాలన్నారు. నిధి ఆప్‌కే నికట్ అని తమ ఫిర్యాదులు సమర్పించవచ్చన్నారు. పింఛనుదారులు, డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి ఈ క్యాంపును సందర్శించవచ్చని రాధానాథ్ పట్టానాయక్ తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
