 
															బాలికపై అత్యాచారం ఘటనలో నిందితులకు జైలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థినిపై అత్యాచారం ఘటనలో ఇద్దరిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. ఐదో అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీనికి సంబంధించిన వివరాలను స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సౌత్ జోన్ డీఎస్పీ భవ్యకిశోర్, సీఐ శివగణేష్ వెల్లడించారు. ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు రాజమహేంద్రవరంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఉంటున్న ఓ విద్యార్థిని దీపావళి సామగ్రి కొనడానికి బయటకు వెళ్లింది. ఆ బాలికకు ముందుగా పరిచయం ఉన్న పాము అజయ్, అతని స్నేహితుడు కాగితపల్లి సత్యస్వామి అక్కడికి వచ్చి ఆమెతో మాట్లాడి తాము కూడా దీపావళి సామగ్రి కొనటానికి వెళ్తున్నట్లు మాయమాటలు చెప్పి మోటారు సైకిల్‌పై ఎక్కించుకున్నారు. ఆల్కాట్ గార్డెన్స్ రైల్వే స్టేషన్ రోడ్డులోని శ్రీగురు రెసిడెన్సీకి ఆమెను తీసుకెళ్లి, ఇందులో సత్యస్వామి లాడ్జి కింద ఉండగా, అజయ్ లాడ్జి రూమ్‌లోకి తీసుకెళ్లి ఆ బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం ఆ బాలికను వసతి గృహం వద్ద వదిలి వెళ్లిపోయాడు. బాధితురాలి ప్రవర్తన గమనించిన వసతి గృహ నిర్వాహకురాలు, జరిగిన విషయం తెలుసుకుని వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రత్యేక పోలీసు బృందం నిందితుల కోసం గాలించింది. ఆల్కాట్ గార్డెన్స్ రైల్వే పార్సిల్ ఆఫీస్ ఎదురుగా నిందితులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకున్నారు. వీరిని చాకచక్యంగా పట్టుకున్న టూ టౌన్ సీఐ శివగణేష్, ఎస్సై శ్యాంసుందర్, హెడ్ కానిస్టేబుల్ భానుమూర్తి, కానిస్టేబుల్స్ షేక్ రబ్బానీ, మహేష్ కుమార్, నాగబాబు, బాలసుబ్రహ్మణ్యంలను ఎస్పీ డి.నరసింహకిశోర్ ప్రత్యేకంగా అభినందించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
