 
															ఉపాధి హామీ పనుల్లో సాంకేతికత పెరగాలి
సామర్లకోట: ఉపాధి హామీ పనుల్లో సాంకేతికత పెరగాల్సిన అవసరం ఉందని జాతీయ గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ) అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎన్‌ఎస్‌ఆర్ ప్రసాద్ అన్నారు. గురువారం సామర్లకోట విస్తరణ శిక్షణ కేంద్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పు, అంబేఽడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలోని ఉపాధి హామీ పథకానికి సంబంధించిన టెక్నికల్ అసిస్టెంట్లు(టీఏ) జూనియర్ ఇంజినీర్లకు మూడు రోజుల శిక్షణను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల ప్రణాళికలో సాంకేతిక పరిజ్ఞానం పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా 30 శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు తొలి బ్యాచ్ శిక్షణను ప్రారంభించామని, ప్రతి ఒక్కరూ శిక్షణలో మెలకువలను తెలుసుకోవాలన్నారు. జీఐఎస్, జీపీఎస్, డ్రోన్‌లకు సంబంధించి సాంకేతిక పద్ధతులపై మూడు రోజుల శిక్షణ ఉంటుందన్నారు. దీనివల్ల పనుల్లో నాణ్యత పెరగడంతో పాటు పని చేసిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నిర్దేశించిన కూలీ అందుతుందన్నారు. కొంత మంది పనులు చేయకుండా పని చేసిన వారితో సమానంగా కూలీ తీసుకుంటున్న విధానానికి చెక్ పెట్టడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ ఎన్‌ఎస్‌కే ప్రసాదరావు మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా ఉద్యోగ నిర్వహణలో నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. చీఫ్ ఇన్‌స్ట్రక్టర్ డి.శ్రీనివాసరావు, డీడీఓ ఎస్‌ఎస్ శర్మ, ఉపాఽధి హామీ అధ్యాపకులు సాగర్, మంగాలక్ష్మి, సూర్యావతి శిక్షణ నిర్వహించగా ఫ్యాకల్టీలు నిహారిక, రామకృష్ణ, టీఏలు, జేఈలు హాజరయ్యారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
