 
															రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
మరొకరికి గాయాలు
కోటనందూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి గాయాలైన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. తుని మండలం ఎన్‌ఎస్ వెంకటనగరానికి చెందిన రెగటి దేవుడు (33) కూలి పనుల నిమిత్తం తన బాబాయి యేందుకంద అప్పారావుతో కలసి గురువారం ఉదయం బైక్‌పై కోటనందూరు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో కేఓ అగ్రహారం దాటిన తరువాత బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయారు. దీంతో బైక్ నడుపుతున్న దేవుడు తలకు బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితికి వెళ్లాడు. వెనుక కూర్చున్న అప్పారావు తీవ్ర గాయాల పాలయ్యాడు. వీరిద్దరినీ 108 అంబులెన్స్‌లో తుని ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే దేవుడు మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు. అప్పారావుకు వైద్యం అందిస్తున్నారు. మృతుడి తల్లి రెగటి పాప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
కాకినాడ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తిమ్మాపురం పోలీసుల వివరాల ప్రకారం.. నేమాం గ్రామ ఎల్విన్‌పేటకు చెందిన గంటా శివరామకృష్ణ (38) లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. తాను పని చేస్తున్న లారీ వద్దకు వెళ్లేందుకు ఏడీబీ రోడ్డులో అచ్చంపేట జంక్షన్ వైపు నుంచి లైట్‌హౌస్ వైపు బైక్‌పై పయనమయ్యాడు. మార్గ మధ్యంలో సూర్యారావుపేట పరిధి అదానీ ఆయిల్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి అతివేగంగా లారీ వచ్చి ఢీకొనడంతో శివరామకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని 108లో జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందాడు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
