
అందని ఆరోగ్యసిరి
సాక్షి, రాజమహేంద్రవరం: ఒప్పందం ప్రకారం అందించిన వైద్య సేవలకు ప్రభుత్వం నెలల తరబడి నయాపైసా బిల్లు చెల్లించడం లేదు. వినతులు ఇస్తే స్పందించడం లేదు. పోరుబాట పట్టినా ఉలుకూపలుకూ లేనట్టుగా ఉండిపోయింది. ఫలితంగా పేదలకు ప్రాణ సంజీవనిగా నిలిచిన ఆరోగ్యశ్రీ (ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్యసేవ) సేవలను ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులు ఈ నెల 10వ తేదీ నుంచి నిలిపివేశాయి. రూ.కోట్లలో పేరుకుపోయిన బకాయిలు తమకు వెంటనే చెల్లించకపోతే ఈ పథకం కింద వైద్య సేవలు అందించలేమంటూ పోరుబాట పట్టాయి. దీంతో, ఆరోగ్యశ్రీ సేవలు అందక పేద, మధ్య తరగతి రోగులు తమ ఆరోగ్య పరిరక్షణకు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా శస్త్రచికిత్సల కోసం వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
600 నుంచి 150కి..
జిల్లావ్యాప్తంగా ఎన్‌టీఆర్ వైద్య సేవ నెట్‌వర్క్ ఆస్పత్రులు 81 ఉన్నాయి. వీటిలో ప్రతి రోజూ 600కు పైగా ఆరోగ్యశ్రీ కేసులు నమోదయ్యేవి. శస్త్రచికిత్సలు 300కు పైగా జరిగేవి. నెట్‌వర్క్ ఆస్పత్రుల సమ్మెతో ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రుల్లో మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి. 40 ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఈ సేవలు స్తంభించాయి. ఫలితంగా ఈ పథకం కింద రోజువారీ రోగుల సంఖ్య 150కి పడిపోయింది. ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో డయాలసిస్, కేన్సర్ చికిత్సలు మాత్రమే అందిస్తున్నారు. మిగిలిన వైద్య సేవల కోసం రూ.వేలు పోయలేక రోగులు అల్లాడుతున్నారు.
పోరుబాటలో..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రులకు బిల్లులు నిలిపివేసింది. జిల్లావ్యాప్తంగా నెట్‌వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.180 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించాలని ఆయా ఆస్పత్రుల యాజమాన్యాలు ఏడాదిగా డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో మందులు, సర్జికల్ పరికరాల కొనుగోలు, వైద్యులు, సిబ్బందికి జీతాల చెల్లింపులకు ఇబ్బందులు పడుతున్నామని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. బకాయిలు చెల్లించాలన్న డిమాండ్‌తో గత ఏప్రిల్‌లో ఎన్టీఆర్ వైద్య సేవలను నిలిపివేశాయి. అప్పట్లో సీఎం స్థాయిలో చర్చలు జరిపి, బిల్లులు చెల్లిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైంది. ఇప్పటి వరకూ ఎలాంటి బిల్లులూ చెల్లించలేదు. గత్యంతరం లేక నెట్‌వర్క్ ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయి. ఇది జరిగి 12 రోజులు దాటుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఆర్‌డీఓ కార్యాలయం వద్ద ధర్నా
ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) ఆధ్వర్యాన ఎన్టీఆర్ వైద్యసే నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు గతంలో ఎన్నడూ లేని విధంగా మంగళవారం రాజమహేంద్రవరం ఆర్‌డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా వైద్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినదించారు. బిల్లులు నిలిచిపోవడంతో సామాన్య ప్రజలకు వైద్య సేవలు అందించలేకపోతున్నామని పేర్కొన్నారు. వెంటనే బిల్లులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేసినప్పటికీ ఆషా వివిధ పద్ధతుల్లో తన వంతు సాయాన్ని పేదలకు అందిస్తోందన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నామని, దశల వారీ ఉద్యమం చేపడతామని నేతలు ప్రకటించారు. ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం చలో విజయవాడ నిర్వహించనున్నామని తెలిపారు. జిల్లా నుంచి ఆస్పత్రుల యాజమాన్యాలు తరలివెళ్లి విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పారు.
ఫ ఇటు రోగుల ఇక్కట్లు
ఫ అటు నెట్‌వర్క్ ఆసుపత్రుల
ఆందోళనలు
ఫ ఎన్టీఆర్ వైద్య సేవ
బకాయిల కోసం రోడ్డెక్కిన వైద్యులు
ఫ కూటమి ప్రభుత్వం
నిర్లక్ష్యంపై నిరసన పథం
ఫ వైద్య సేవలు నిలిచిపోయి వారం
దాటినా స్పందించని సర్కారు
ఫ జిల్లా వ్యాప్తంగా 40 నెట్‌వర్క్ ఆసుపత్రులకు రూ.180 కోట్లకు
పైగా బకాయి
వైద్య రంగాన్ని చులకనగా చూడొద్దు
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు ఐసీయూలో ఉన్నాయి. పాత బకాయిలు చెల్లించి, వాటికి ఆక్సిజన్ అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. పాత బకాయిలు కొంత చెల్లించి, మిగిలిన వాటి చెల్లింపునకు నిర్దిష్ట సమయం ప్రకటించాలి. ఎప్పుడు చెల్లిస్తారో రాతపూర్వకంగా చెప్పాలి. ఇవన్నీ చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. బకాయిలు అడుగుతూంటే వైద్యులను, వైద్య రంగాన్ని ప్రభుత్వం చులకనగా చూస్తోంది. దీంతో, ప్రజలకు తీరని నష్టం జరుగుతోంది. వైద్యులను రోడ్డుపాలు చేయడం ఎంతవరకూ సమంజసం? మావి గొంతెమ్మ కోర్కెలు కావు. ఒకేసారి బకాయిలు తీర్చమని చెప్పడం లేదు. రూపాయి విదిలించి నాలుగు రూపాయల పని చేయించుకుంటున్నారు.
– డాక్టర్ విజయ్ భాస్కర్, అధ్యక్షుడు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రాజమహేంద్రవరం
ప్రతి నెలా బిల్లులు చెల్లించాలి
ఆస్పత్రుల్లో గైనిక్, ఇతర వైద్య సేవలు అందిస్తున్నాం. సేవలు ఆపాలన్న ఉద్దేశం మాకు లేదు. బిల్లులు చెల్లించాలని రెండు నెలలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేదంటే సేవలు నిలిపివేస్తామని సమాచారం ఇచ్చాం. ప్రభుత్వం కొంతయినా స్పందించి ఉంటే బాగుండేది. మేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా ఆవేదన చెప్పుకునేందుకే రోడ్డెక్కాం. ప్రతి నెలా ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలి.
– డాక్టర్ లలిత, రాజమహేంద్రవరం

అందని ఆరోగ్యసిరి

అందని ఆరోగ్యసిరి