రాష్ట్రంలో ఆటవిక రాజ్యం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ఆటవిక రాజ్యం

Oct 23 2025 6:16 AM | Updated on Oct 23 2025 6:16 AM

రాష్ట్రంలో ఆటవిక రాజ్యం

రాష్ట్రంలో ఆటవిక రాజ్యం

ఆడబిడ్డలకు రక్షణేది?

హాస్టల్‌ బాలికపై లైంగిక దాడి దారుణం

విద్యార్థినిని ఒంటరిగా ఎలా పంపారు?

జక్కంపూడి విజయలక్ష్మి

సీటీఆర్‌ఐ: రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని బీసీ హాస్టల్‌ బాలికపై జరిగిన లైంగిక దాడి నేపథ్యంలో బుధవారం రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మేడపాటి షర్మిలారెడ్డితో కలిసి ఆ వసతి గృహానికి వెళ్లారు. బాలిక బయటకు వెళ్లిన విషయాన్ని రిజిస్టర్‌లో నమోదు చేయకపోవడంపై హాస్టల్‌ వార్డెన్‌ను ప్రశ్నించారు. అయితే వారు లోపలకు వెళ్లి, రిజిస్ట్రర్‌లో పేరు నమోదు చేసుకుని రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయలక్ష్మి మాట్లాడుతూ బాలికను బయటకు పంపడం ఒక తప్పు, పైగా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నిలదీశారు. మహిళలపై అత్యాచారం చేసిన వారికి అదే ఆఖరు రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు కానీ, ఏ ఒక్కరికీ శిక్ష పడటం లేదన్నారు. దానికి రెడ్‌బుక్‌ రాజ్యాంగమే కారణమని చెప్పారు. అంబేడ్కర్‌ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతోందా అని ప్రశ్నించారు. పిల్లలు బాగా చదువుకోవాలని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో విద్యాదీవెన, వసతి దీవెన, గోరుముద్ద వంటి పథకాలు అందించారన్నారు. కూటమి పాలనలో ఈ రోజు హాస్టళ్లలో దౌర్భాగ్య పరిస్థితులు దాపురించాయన్నారు. రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు కనిపించడం లేదని పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ముందు గగ్గోలు పెట్టారని, అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. అనేక మంది మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్న విషయం హోం మంత్రి అనితకు తెలియడం లేదా ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆనంద్‌, ఆడపా అనిల్‌, సోము, న్యాయవాది తాడేపల్లి విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇద్దరు నిందితుల అరెస్టు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): బాలికపై అత్యాచారం ఘటనకు సంబంధించి కోనసీమ జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ అంబేడ్కర్‌ కాలనీకి చెందిన పాము అజయ్‌, అదే జిల్లా రావులపాలెం మండలం రావులపాడుకు చెందిన కాగితపల్లి సత్యస్వామిలను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. టూటౌన్‌ సీఐ శివ గణేష్‌ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. అజయ్‌కు రూమ్‌ అద్దె కిచ్చిన రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న శ్రీగురు రెసిడెన్సీ నిర్వాహకులపై చర్యలు తీసుకునే దిశగా సబ్‌ కలెక్టర్‌కు సిఫారసు చేశారు.

మైనర్లకు అద్దెకిస్తే చర్యలు

హోటళ్లలో రూములను మైనర్లకు అద్దెకిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. సౌత్‌జోన్‌ డీఎస్పీ భవ్య కిశోర్‌ ఆధ్వర్యంలో హోటళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. రూమ్‌లు తీసుకున్న వారిపై అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

హాస్టల్‌ వార్డెన్‌ ఉమాదేవి సస్పెన్షన్‌

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): బాలిక ఘటన విషయంలో హాస్టల్‌ వార్డెన్‌ ఉమాదేవి నిర్లక్ష్యంగా వ్యవహరించారని విచారణలో తేలడంలో ఆమెను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ కీర్తి చేకూరి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో పిల్లల సంరక్షణ, భద్రత విషయంలో పూర్తి అప్రమత్తత పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాలిక ఘటనపై కేఆర్‌ఆర్‌సీ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ నేతృత్వంలో సమగ్ర విచారణ చేపట్టగా, హాస్టల్‌ సంక్షేమ అధికారి ఉమాదేవి విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినట్లు నిర్ధారణ అయ్యిందన్నారు. దీంతో ఆమెను తక్షణం విధుల నుంచి సస్పెండ్‌ చేశామన్నారు. వసతి గృహాల నుంచి పిల్లలను పంపించే ముందు, వారి బంధువుల వివరాలు, గుర్తింపు ఆధారాలు నమోదు చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement