 
															ఆలయ కమిటీ సభ్యులకు ఆభరణాల అందజేత
సామర్లకోట: రోడ్డుపై పడి పోయిన వెండి, బంగారు ఆభరణాలను సామర్లకోట పోలీసులు గుర్తించి ఆలయ ధర్మకర్తలకు అందజేశారు. సామర్లకోట సీఐ ఎ.కృష్ణ భగవాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలేశ్వరం మండలం కంబాలపాలెంలోని సుబ్రహ్మణేశ్వరస్వామికి చెందిన వెండి, బంగారు ఆభరణాలు పాతబడి పోయాయి. దీంతో వాటిని మార్పు చేయడానికి ఆలయ కమిటీ సభ్యులైన కొప్పిశెట్టి సత్తిబాబు, శొంటెపు బాలకృష్ణ బుధవారం మోటారు సైకిల్‌పై కాకినాడ బయలు దేరారు. అయితే సామర్లకోట సమీపంలో బైక్‌కు తగిలించిన ఆభరణాల బ్యాగు తెగిపోయి రోడ్డుపై పడిపోయింది. ఆ విషయాన్ని కమిటీ సభ్యులు గమనించలేదు. అలా కొంతదూరం వెళ్లిన తర్వాత చూస్తే బ్యాగు కనిపించలేదు. వెంటనే సామర్లకోట పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సూచనల మేరకు హెడ్ కానిస్టేబుల్ రాజు, కానిస్టేబుల్ నాగరాజు సామర్లకోట రోడ్డులో గాలింపు చేశారు. సామర్లకోట ప్రతిపాడు రోడ్డులో బ్యాగు మీదుగా లారీ వెళ్లి పొయిన విషయాన్ని గుర్తించారు. ఈ మేరకు కేజీన్నర బరువున్న ఆభరణాలను సీఐకి అందజేయగా, వాటిని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
