 
															మన ఉత్తరం.. మళ్లీ రాసేద్దాం
● తపాలా శాఖ ఆధ్వర్యంలో పోటీలు
● వయో పరిమితి లేకుండా అందరూ అర్హులే
● డిసెంబర్ 8 వరకూ గడువు
బాలాజీ చెరువు (కాకినాడ): సెల్‌ఫోన్ విజృంభణతో పోస్టుకార్డు కనుమరుగైంది. దాని గురించి నేటి తరం విద్యార్థులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. అయితే మారిన కాలానికి అనుగుణంగా తపాలాశాఖ అప్‌గ్రేడ్ అవుతోంది. ఈ నేపథ్యంలో తపాలా సేవలు, ఆ కాలం నాటి పోస్టుకార్డుల గురించి విద్యార్థులకు, ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఏటా సరికొత్త అంశంతో పోటీలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది లెటర్ టూ మై రోల్ మోడల్ అంశంపై లేఖలను ఆహ్వానిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ధాయ్ ఆఖర్ పేరుతో ఈ పోటీలు జరుపుతోంది. ఆధునిక కాలంలో ఉత్తరాలు రాసేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. కేవలం సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే సమాచారం పంపుకొంటున్నారు. అందుకే ఉత్తరాన్ని గుర్తు చేద్దామని తపాలా శాఖ నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రియమైన నువ్వు.. ఓ ఉత్తరం పంపు అంటూ ప్రోత్సహిస్తూ పోటీలు పెడుతోంది.
బహుమతులు
విభాగాల వారీగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో విజేతలను ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ఒక్కో విభాగంలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి (12 మందికి మించకుండా) నగదు బహుమతి అందజేస్తారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు వరసగా రూ.25 వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున అందిస్తారు. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన వారిని జాతీయ స్థాయికి పంపుతారు. జాతీయ స్థాయిలో విజేతలకు ప్రథమ స్థానానికి రూ.50 వేలు, ద్వితీయ రూ.25 వేలు, తృతీయ స్థానానికి రూ.10 వేలు ప్రదానం చేస్తారు.
అర్హులు ఎవరంటే..
ఉత్తరం రాసే వారు భారత పౌరులై ఉండాలి. వయో పరిమితి లేదు. 18 ఏళ్ల లోపు ఒక కేటగిరి, 18 ఏళ్లు పైబడిన వారిని మరో కేటగిరీగా విభజించారు. తెలుగు, హిందీ, ఆంగ్లం భాషల్లో వ్యాసం రాయవచ్చు. చేతితో రాసిన వ్యాసాన్ని మాత్రమే అనుమతిస్తారు. ఎన్వలప్ కవర్ అయితే వెయ్యి పదాలకు మించకుండా, ఇన్‌లాండ్ లెటర్‌లో 500 పదాలకు మించకుండా రాయాల్సి ఉంటుంది. వీటిని ది చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, ఏపీ సర్కిల్, విజయవాడ – 520013 చిరునామాకు లేదా. సమీపంలోని తపాలా కార్యాలయాలకు డిసెంబర్ 8వ తేదీలోగా పంపాలి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
