 
															కూటమి పాలనలో రక్షణ కరవు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కూటమి ప్రభుత్వంలో బాలికలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రతి రోజూ ఏదో ఒకచోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ అన్నారు. రాజమహేంద్రవరంలోని గణేష్ చౌక్ వద్ద గల బీసీ హాస్టల్ బాలికపై లైంగిక దాడి జరిగిన నేపథ్యంలో బుధవారం ఆ హాస్టల్ సిబ్బందిని, పోలీసులను నిలదీశారు. ముందుగా హాస్టల్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ రామ్ మాట్లాడుతూ మద్యాన్ని పెంచి పోషిస్తూ.. కూటమి నాయకులు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారన్నారు. పోలీసులు కూడా కూటమి ప్రభుత్వ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సాక్షాత్తూ తెలుగుదేశం పార్టీ నాయకుల ఆడియో క్లిప్పింగ్ బయటకు వచ్చినా కనీసం స్థానిక టీడీపీ నాయకులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీన్ని బట్టి దందాలో స్థానిక టీడీపీ నాయకుల పాత్ర ఏమిటో అర్థం అవుతోందన్నారు. మద్యం అమ్మకాలను కూటమి ప్రోత్సహించడం వల్లే బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. హాస్టల్ విద్యార్థులకు రక్షణ లేకపోవడంపై కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ బెల్టు షాపులను విపరీతంగా పెంచి, మద్యాన్ని ఏరులై పారిస్తున్నారన్నారు. ఎమ్మార్పీ కంటే అత్యధికంగా అమ్మకాలు సాగిస్తున్నారన్నారు.
మహిళలు, బాలికలపై పెరిగిన అఘాయిత్యాలు
ప్రభుత్వ కార్యకర్తల్లా పోలీసులు
మాజీ ఎంపీ భరత్ రామ్ ధ్వజం
గూడూరి శ్రీనివాస్‌తో కలిసి ఆందోళన

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
