 
															అసభ్యంగా ప్రవర్తించాడని అంతం చేశారు
● వీడిన వ్యక్తి హత్య కేసు మిస్టరీ
● ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు
పిఠాపురం: చిత్రాడ రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద ఇటీవల దొరికిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కేసును పిఠాపురం పోలీసులు ఛేదించారు. చుట్టపు చూపుగా వచ్చిన ఆ వ్యక్తి ఇంటి మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడనే కక్షతోనే అంతమొందించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన ఐదుగురిని బుధవారం అరెస్ట్ చేశారు. ఆ వివరాలను పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ జి.శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 8న పిఠాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని వాసంశెట్టి పెద్దిరాజు వ్యవసాయ భూమిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. వీఆర్వో మడికి కామేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు. పిఠాపురం టౌన్ ఎస్సై మణి కుమార్, రూరల్ ఎస్సై జాన్ బాషా, ఉప్పాడ ఎస్సై వెంకటేష్, క్రైమ్ సిబ్బందితో మూడు ప్రత్యేక బృందాలుగా విచారణ చేశారు. సాంకేతిక ఆధారాలు, సీసీ పుటేజీల ఆధారంగా మృతుడిని తమిళనాడులోని తేని జిల్లా మనుతు గ్రామానికి చెందిన పాండేగా గుర్తించారు.
పలకరించడానికి వచ్చి..
హనుమాన్ జంక్షన్‌లోని తినుబండారాలు తయారు చేసే ఫ్యాక్టరీలో పాండే పనిచేసేవాడు. తనకు పరిచయస్తులు, అదే రాష్ట్రానికి చెందిన పౌల్ రాజ్ ఆండోనీ, లౌర్డు పకియం, మడసామి కారుప్పసామితో కలిసి ఈ నెల 6న పిఠాపురం జగ్గయ్య చెరువులో నివాసముంటున్న పూచి ధనలక్ష్మి అలియాస్ ధనమ్మ ఇంటికి వారు వచ్చారు. ధనమ్మ భర్త రామస్వామికి ఆరోగ్యం బాగాలేనందున అతడిని చూడటానికి వీరందరూ వచ్చారు. ఆ రోజు రాత్రి ఆ నలుగురూ ధనమ్మ ఇంటి వద్దే ఉన్నారు. ఈ నేపథ్యంలో ధనమ్మతో పాండే అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో కోపోద్రిక్తులైన ధనమ్మ, పౌల్ రాజ్ ఆండోనీ, లౌర్డు పకియం, మడసామి కారుప్పసామి కలిసి, పిఠాపురం మండలం మాదాపురానికి చెందిన చాగంటి గణేష్ ఆటోలో ఈ నెల 7వ తేదీన పిఠాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని పంట పొలాల్లోకి పాండేను తీసుకెళ్లారు. అక్కడ బండ రాయితో కొట్టి హత్య చేసి, పరారయ్యారు. నిందితులను ఈ నెల 21న ఉప్పాడ కొత్తపల్లి గ్రామ శివారులో పోలీసులు అరెస్టు చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
