 
															పెళ్లికి వెళ్లి వస్తూ మృత్యు ఒడికి..
● ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
● క్యాబిన్‌లో ఇరుక్కుని యువకుడి మృతి
● కడియపులంకలో ఘటన
కడియం: ఆగిఉన్న లారీని కారు ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. జాతీయ రహదారిపై కడియపులంక వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా గాజువాక మండలం కొత్తపాలెం గ్రామంలోని అగనంపూడికి చెందిన దాసరి కిరణ్ కుమార్ (28) మంగళవారం మధ్యాహ్నం తన కారులో విజయవాడకు వివాహానికి వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా బుధవారం మధ్యాహ్నం కడియపులంక గోకుల్ నర్సరీ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో కారు క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన కిరణ్ కుమార్ మృతి చెందాడు. నేషనల్ హైవే సేఫ్టీ అధికారులు క్రేన్ సహాయంతో లారీ నుంచి కారును లాగి, కిరణ్ కుమార్ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కిరణ్ కుమార్ తండ్రి నీలకంఠరావు ఫిర్యాదు మేరకు కడియం ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒక్కగానొక్క కుమారుడు
దాసరి నీలకంఠరావు, శాంతి దంపతులకు కిరణ్ కుమార్ ఒక్కడే కుమారుడు. అతడు ఫార్మా సిటీలోని ఫార్మా కంపెనీలో సేఫ్టీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. కిరణ్ కుమార్ మృతి వార్త వినగానే ఆ దంపతులిద్దరూ సొమ్మసిల్లి పడిపోయారు. వివాహానికి వెళ్లిన కుమారుడు ఇలా మృత్యువాత పడడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
 
							పెళ్లికి వెళ్లి వస్తూ మృత్యు ఒడికి..

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
