 
															ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
దేవరపల్లి: మండలంలోని లక్ష్మీపురం వద్ద చాగ ల్లు రోడ్డులో జరిగిన ట్రాక్టర్ ప్ర మాదంలో పల్లంట్లకు చెందిన జాలపర్తి రాజు (37) మృతి చెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. పల్లంట్ల గ్రామానికి చెందిన జాలపర్తి రాజు లక్ష్మీపురంలో ఒక రైతు వద్ద వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం పొలంలో దుక్కు దున్నటానికి ట్రాక్టర్ డ్రైవ్ చేసుకుంటూ వెళుతుండగా లక్ష్మీపురం–పల్లంట్ల రోడ్డులో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాజుపై ట్రాక్టర్ పడడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
ప్రత్తిపాడు: పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన ఐనెల్లి వాసు (23) అప్పుల బాధ తాళలేక సోమవారం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతడికి స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు స్థానిక పోలీసులు తెలిపారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
వృద్ధురాలి ఆత్మహత్యాయత్నం
అన్నవరం: స్థానిక పవర్ ఆఫీసు వద్ద గల పంపా ఘాట్‌లో బుధవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వృద్ధురాలు నది లోపలకు వెళ్లి ఆత్మహత్యకు యత్నించింది. ఆ సమయంలో సత్యదేవుని తెప్పోత్సవం కోసం అక్కడ పనిచేస్తున్నవారు ఆమెను బయటకు తీసుకువచ్చారు. ఆమెను పేరు అడిగితే ఏమీ చెప్పకుంటూ, ఏడ్చుకుంటూ వెళ్లిపోయిందని వారు వివరించారు. కాగా.. దీనిపై తమకు ఎటువంటి సమాచారం లేదని అన్నవరం పోలీసులు తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
