 
															విద్యుత్ ఉచ్చుకు వ్యక్తి బలి
ప్రత్తిపాడు రూరల్: మండలంలోని ఇ.గోకవరం పంచాయతీ పరిధి ఆరళ్లధార అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులను హతమార్చేందుకు వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చుకు వ్యక్తి బలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దిపాలెం గ్రామానికి చెందిన బొందలపు వీర కుమార్ (నాగు) (31) వన్య ప్రాణులను వేటాడేందుకు రౌతుపాలెం నుంచి వంతాడ వెళ్లే మార్గంలో ఉచ్చును ఏర్పాటు చేశాడు. దానిలో అడవి జంతువులు పడ్డాయో లేదో చూసేందుకు బుధవారం తెల్లవారు జామున అక్కడకు బయలుదేరాడు. అయితే అదే మార్గంలో లంపకలోవ గ్రామానికి చెందిన చిన్న జయబాబు, నాతవరం గ్రామానికి చెందిన మామిడి నాగబాబు జంతువుల కోసం విద్యుత్ ఉచ్చును ఏర్పాటు చేశారు. దాన్ని గమనించని వీర కుమార్ ఆ ఉచ్చుకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వస్థలం గోకవరం మండలం సూడికొండ. పెద్దిపాలెం గ్రామానికి చెందిన రాళ్ల కాసులమ్మను 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఆరేళ్ల క్రితం అత్తారింటికి కాపురం వచ్చేశాడు. ఈ దంపతులకు దుర్గాతేజ రాజ్‌కుమార్ అనే కుమారుడు ఉన్నాడు. ప్రత్తిపాడు సీఐ బి.సూర్య అప్పారావు, పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని, పరిసరాలను పరిశీలించారు. విద్యుత్ ఉచ్చు అమర్చిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీర కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
