 
															వాడపల్లి వెంకన్నకు రూ.1.87 కోట్ల ఆదాయం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారికి ఆలయ హుండీల ద్వారా రూ.1,87,33,329 ఽఆదాయం వచ్చినట్టు దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఆలయంలోని హుండీలను 35 రోజుల అనంతరం బుధవారం దేవదాయశాఖ అధికారుల పర్యవేక్షణలో తెరిచి, వసంత మండపంలో లెక్కించారు. వేంకటేశ్వరస్వామి ప్రధాన హుండీలు, విశ్వేశ్వరస్వామి వారి హుండీల ద్వారా రూ 1,41,69,487, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.45,63,842తో కలిపి మొత్తం రూ 1,87,33,329 వచ్చినట్టు ఈవో వివరించారు. వీటితో పాటు 47 గ్రాముల బంగారం, 1.240 కేజీల వెండి, యూఎస్‌ఏ, కువైట్, సింగపూర్, దుబాయ్, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా దేశాల కరెన్సీ నోట్లు 25 వచ్చాయన్నారు. పర్యవేక్షణ అధికారులుగా మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామివారి దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్‌బాబు, జిల్లా దేవదాయశాఖ తనిఖీదారు జె.రామలింగేశ్వరరావు, పలివెల గ్రూపు దేవాలయాల గ్రేడ్–2 ఈఓ పీవీవీఎస్ కామేశ్వరరావు పాల్గొన్నారు.
25న సాఫ్ట్‌బాల్ ఎంపికలు
ఐ.పోలవరం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 25న అండర్ 14, 17 విభాగాల్లో సాఫ్ట్‌బాల్ ఎంపికలు నిర్వహించనున్నట్టు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం బాషా తెలిపారు. ఐ.పోలవరం మండలం జి.వేమవరం క్రీడా మైదానంలో బాలికలు, బాలురకు విడివిడిగా ఎంపికలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆ రోజు ఉదయం 9 గంటలలోపు రిపోర్టు చేయాలన్నారు. ఇతర వివరాలకు కోనసీమ జిల్లా ఎస్‌జీఎఫ్ సెక్రటరీలు కొండేపూడి ఈశ్వరరావు 93469 20718, ఎన్‌ఎస్ రమాదేవి 94400 94984 లను సంప్రదించాలన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
