
ఆహారం.. ఆరోగ్యం
కపిలేశ్వరపురం: మనిషి జీవితంలో ఆహారానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కేవలం ఆకలి తీరడానికి మాత్రమే కాదు.. ఆరోగ్యం పెరగడానికి, శక్తి రావడానికి, తద్వారా సమాజ ప్రగతికి ఎంతో కీలకం. ఆహార ఉత్పత్తిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వ్యవసాయ ప్రాధాన్యమైన ఈ జిల్లాలో పౌల్ట్రీ, ఆక్వా రంగాలు కూడా ఊపందుకున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆహార ఉత్పత్తి రంగాలకు చేయూత లభించింది. ప్రస్తుత కూటమి పాలనలో ప్రధాన ఆహార ఉత్పత్తి రంగమైన వరి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గురువారం (అక్టోబర్ 16 ) ప్రపంచ ఆరోగ్యం దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
ప్రపంచ ఆహార దినోత్సవ ప్రాధాన్యం
1945 అక్టోబర్ 16న యునైటెడ్ నేషన్స్‌కు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ అసోసియేషన్ (ఎఫ్‌ఏవో) అనే సంస్థ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ రోజును ప్రపంచ ఆహార దినంగా జరుపుకొంటున్నారు. ఆహారానికి సంబంధించిన వ్యవసాయం, ఆక్వా, పాడి పరిశ్రమ తదితర రంగాల్లో కాలానుగుణంగా వస్తున్న మార్పులు, ప్రగతిపై ఎఫ్‌ఏవో సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక సదస్సులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఉమ్మడి జిల్లా ప్రత్యేకతలు
● ఆహార ఉత్పత్తిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చాలా కీలకంగా మారింది. దీనిలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1.54 లక్షల ఎకరాల వరి సాగు నుంచి 4.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి లభిస్తోంది. కాకినాడ జిల్లాలో 2.14 లక్షల ఎకరాల నుంచి 5 లక్షల టన్నులు, తూర్పుగోదావరి జిల్లాలో 1.75 లక్షల ఎకరాల నుంచి 5.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది.
● కోనసీమ జిల్లాలో 1.78 లక్షల ఎకరాల్లో ఉత్పత్తి అవుతున్న కొబ్బరిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.
● ఉమ్మడి జిల్లాలో సుమారు 15 వేల హెక్టార్లలో దాదాపు 2.25 లక్షల టన్నుల కూరగాయలు, ఆకుకూరలు దిగుబడి అవుతున్నాయి.
● ఉమ్మడి జిల్లాలో సుమారు 10 మధ్య, చిన్నతరహా, 40 కుటీర మామిడి తాండ్ర తయారీ పరిశ్రమలు ఉన్నాయి. విస్తారంగా మామిడి సాగు ఉంది. కోనసీమలోని ఆత్రేయపురం, కాకినాడ జిల్లాలోని పండూరు, సర్పవరం, తమ్మవరం, గొల్లప్రోలు, కత్తిపూడి, తొండంగి, జగ్గంపేట, చేబ్రోలు, ధర్మవరం, మల్లిశాలల్లో ఉత్పత్తి విస్తారంగా సాగుతోంది.
● ఉమ్మడి జిల్లాలో 25,58,729 పశువుల పెంపకంతో పాలు, మాంసం ఉత్పత్తి జరుగుతోంది. సుమారు 200 పౌల్ట్రీల్లో 1.40 కోట్ల కోళ్లను పెంచుతున్నారు. వీటి ద్వారా మాంసం, గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి.
● 60 వేల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా 190 హేచరీలు ద్వారా ఏడాదికి 20 వేల మిలియన్ల సీడ్ ఉత్పత్తి చేస్తున్నారు. ఏటా 1.35 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతి జరుగుతోంది. అత్యధికంగా కోనసీమ జిల్లాలో 36,736 ఎకరాల్లో ఆక్వాసాగు చేస్తున్నారు.
కూటమి పాలనలో అస్తవ్యస్తం
రాష్ట్రంలో పేదలు రేషన్ షాపుల్లో ఇచ్చే సరకులపై ఆధారపడతారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫిబ్రవరి నుంచి దాదాపు తొమ్మిది నెలలుగా కంది పప్పు సరఫరా చేయడం లేదు. కేవలం బియ్యం, పంచదార మాత్రమే ఇస్తున్నారు. దీని వల్ల పేదలు అవస్థలు పడుతున్నారు. జీఎస్టీ 2.0 నూతన శ్లాబుల విధానం క్షేత్ర స్థాయిలో అమలు కాకపోవడంతో నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
తూతూమంత్రంగా తనిఖీలు
ఆహార భద్రతా విభాగంలో తగినంతమంది సిబ్బంది లేకపోవడంతో క్షేత్ర స్థాయిలోని హోటళ్లు, ఇతర ఆహారం తయారీ, విక్రయ కేంద్రాలను తనిఖీ చేయడంలో లోపాలు తలెత్తుతున్నాయి. కోనసీమ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ 85 తనిఖీలు చేయగా 38 కేసులు నమోదు చేశారు. రూ.3.21 లక్షల అపరాధ రుసుం వసూలు చేశారు.
సమాజ ప్రగతికి మూలం
ఆహార ఉత్పత్తిలో ఉమ్మడి జిల్లా కీలకం
వ్యవసాయం, పౌల్ట్రీ,
ఆక్వా రంగాల్లో ముందంజ
దేశ, విదేశాలకు ఎగుమతులు
నేడు ప్రపంచ ఆహార దినోత్సవం