
రాష్ట్రంలో నాలుగు స్పోర్ట్స్ అకాడమీలు
దేవరపల్లి: రాష్ట్రంలో నాలుగు స్పోట్స్ అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్టు ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) డైరెక్టర్ పేరం రవీంద్రనాథ్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. తిరుపతి, నెల్లూరు, కాకినాడ, విశాఖలలో అకాడమీల ఏర్పాటుకు శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు అధ్యక్షతన ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో తీర్మానించినట్టు ఆయన చెప్పారు. ఒక్కొక్క అకాడమీలో 14 నుంచి 16 గేమ్స్ ఉంటాయని, ఆరు టీమ్ గేమ్స్ కాగా, మిగిలినవి వ్యక్తిగత క్రీడలని ఆయన తెలిపారు. విజయనగరంలో సుమారు 60 ఎకరాల్లో క్రీడా పాఠశాల ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం తిరుపతిలో 100 ఎకరాల్లో క్రీడా పాఠశాల ఉందని ఆయన చెప్పారు. ఈ ఏడాది తొలి విడతలో దేవరపల్లి, కొండిపి, కుప్పం, పాయకరావుపేటలో క్రీడా వికాస కేంద్రాలు నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. కొవ్వూరులో రాష్ట్రస్థాయి అండర్–17 వాలీబాల్ పోటీలు, దేవరపల్లిలో అండర్–17 సెపక్‌తక్రా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. 2025 డీఎస్సీ ద్వారా 450 మంది విద్యార్థులకు పైబడి ఉన్న పాఠశాలకు ముగ్గురు పీడీలు ఉన్నారని, మిగిలిన పాఠశాలకు ఇద్దరు పీఈటీలు ఉన్నట్టు ఆయన తెలిపారు. దేవరపల్లి మండలంలో దేవరపల్లి, దుద్దుకూరు, యర్నగూడెం, చిన్నాయగూడెం, యాదవోలు గ్రామాల్లోని జెడ్పీ పాఠశాలల్లో మైదానాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన చెప్పారు.
యుద్ధ ప్రాతిపదికన
పోలవరం పనులు
సాక్షి, రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. స్థానిక క్వారీ ఏరియాలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజుతో కలసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను సీఎంగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు అంచనా రూ.16,100 కోట్లు ఉండేదని, ప్రస్తుతం చాలా పెరిగిందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని, 23 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అవుతుందన్నారు. 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని గుర్తుచేశారు. కృష్ణా జలాలపై 1976లో బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 811 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాడుకునే అవకాశం ఉందని, ప్రతి నీటి బొట్టును మనం వాడుకోవాలని అభిప్రాయపడ్డారు. మన ప్రాంతంలో రొయ్యలు, చేపలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని, దీని వల్ల రూ.11 వేల కోట్ల ఆదాయం వచ్చేదని, అమెరికాలో తీసుకున్న పన్నుల విధానం వల్ల ఏర్పడిన ఇబ్బందిని అధిగమించే చర్యలు చేపట్టడంపై దృష్టి పెట్టాలన్నారు. తొలుత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వారు నివాళులర్పించారు.
ఐఫోన్ కొనుగోలులో
రూ.1.04 లక్షల మోసం
రాజమహేంద్రవరం రూరల్: ఓఎల్‌ఎక్స్‌లో పెట్టిన ఐఫోన్‌ను కొనుగోలు చేద్దామనుకుంటే గుర్తు తెలియని వ్యక్తి తనను సంప్రదించి నగదు వేస్తే ఐఫోన్ అందజేస్తానని చెబితే అతని బ్యాంకు ఖాతాకు రూ.1.04 లక్షలు వేస్తే తనను మోసం చేసాడని మోరంపూడి సాయినగర్‌కు చెందిన పసగడుగుల రాజా శ్రీవెంకటసాయి బుధవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం మోరంపూడి సాయినగర్‌కు చెందిన సాయి ఓఎల్‌ఎక్స్‌లో ఐఫోన్ ఎం ప్రో మోడల్‌ను కొనుగోలు చేయడానికి గుర్తు తెలియని వ్యక్తికి గత నెల 26వ తేదీన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాకు రూ.1.04 లక్షలు పంపాడు. కానీ సదరు వ్యక్తి ఐఫోన్‌ను అందించకుండా సాయి ఫోన్‌నెంబర్‌ను బ్లాక్ చేశాడు. సదరు వ్యక్తిపై వెంటనే సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయడంతో ఆ మొత్తంలో రూ.1,03,970ను హోల్డ్‌లో పెట్టినట్టు సాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు బొమ్మూరు ఇన్‌స్పెక్టర్ పి.కాశీవిశ్వనాథం ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
● విజయనగరంలో
60 ఎకరాల్లో క్రీడా పాఠశాల
● శాప్ డైరెక్టర్ రవీంధ్రనాథ్

రాష్ట్రంలో నాలుగు స్పోర్ట్స్ అకాడమీలు