
కొండపై భక్తుల సందడి
● సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
● దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం
అన్నవరం: రత్నగిరికి ఆదివారం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. కొండ పైన, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ శనివారం రాత్రి, ఆదివారం ఉదయం పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, పెళ్లి బృందాలతో పాటు సెలవు దినం కావడంతో ఇతర భక్తులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సుమారు 40 వేల మంది సత్యదేవుని దర్శించుకున్నారు. క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం భక్తులతో రద్దీగా మారిపోయింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం, రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణలు చేశారు. స్వామివారి వ్రతాలు మూడు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని టేకు రథంపై ఆలయ ప్రాకారంలో ఉదయం ఘనంగా ఊరేగించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల ఘోష నడుమ పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రాగా, స్వామి, అమ్మవార్లను రథంపై మూడుసార్లు ఊరేగించారు.
తలుపులమ్మ సన్నిధి.. రద్దీ
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం రద్దీ నెలకొంది. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో 10 వేల మంది భక్తులు అమ్మవారి సన్నిధికి తరలి వచ్చారని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,83,165, పూజా టికెట్లకు రూ.1,76,300, కేశఖండన శాలకు రూ.13,440, వాహన పూజలకు రూ.6,800, వసతి గదులు, పొంగలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.81,572, విరాళాలు రూ.65,135, వెరసి మొత్తం రూ.5,26,412 ఆదాయం సమకూరిందని వివరించారు. వసతి గదులు లభించని భక్తులు ఆలయ ప్రాంగణంలో చెట్ల కింద, కొండ దిగువన ప్రైవేటు కాటేజీల్లోను వంటలు, భోజనాలు చేశారు.
ఏసీ బస్సులో 10 శాతం రాయితీ
అమలాపురం రూరల్: ఆర్టీసీ అమలాపురం డిపో నుంచి హైదరాబాద్‌కు నడుపుతున్న అమరావతి ఏసీ బస్సు టికెట్ రేట్లలో ఈ నెల 31 వరకూ 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎస్‌టీపీ రాఘవకుమార్ ఆదివారం తెలిపారు. అమలాపురం నుంచి హైదరాబాద్ ఎంజీబీఎస్‌కు రూ.1,250, బీహెచ్‌ఈఎల్‌కు రూ.1,300 ధరతో టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. అమలాపురం నుంచి రాత్రి 8.30 గంటలకు, హైదరాబాద్ నుంచి రాత్రి 7.45 గంటలకు ఈ బస్సు బయలుదేరుతుందని తెలిపారు.

కొండపై భక్తుల సందడి