
కోటసత్తెమ్మ ఆలయం రేపు మూసివేత
నిడదవోలు రూరల్: మండలంలోని తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆదివారం చంద్రగ్రహణం కారణంగా మూసివేస్తున్నట్టు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ శుక్రవారం తెలిపారు. ఆదివారం ఉదయం కోటసత్తెమ్మ అమ్మవారికి యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించి సాయంత్రం 4 గంటలకు మూసివేసి తిరిగి 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు సంప్రోక్షణ అనంతరం అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులంతా ఈ విషయాన్ని గమనించి అమ్మవారి దర్శనానికి రావాలని ఆయన పేర్కొన్నారు.
జేసీగా మేఘ స్వరూప్
బాధ్యతల స్వీకరణ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వై.మేఘ స్వరూప్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని జేసీ చాంబర్‌లో వేద మంత్రోచ్ఛారణల నడుమ ఈ కార్యక్రమం జరిగింది. అంతకు ముందు ఆయన కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ప్రశాంతిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి అభినందనలు తెలుపుతూ జిల్లా పరిపాలనలో జాయింట్ కలెక్టర్ పాత్ర చాలా కీలకం అన్నారు. అభివృద్ధి, సంక్షేమ రంగాలలో జిల్లాను ప్రగతి పథంలో నడిపే దిశలో అన్ని శాఖలతో సమన్వయం అవసరమన్నారు. ప్రభుత్వ పథకాలు, ప్రజా సేవలు సమర్థంగా అమలు చేయడానికి కృషి చేయాలని సూచించారు. కాగా.. జేసీకి కలెక్టరేట్ కార్యాలయ జిల్లా అధికారులు, సూపరింటెండెంట్, సిబ్బంది స్వాగతం పలికారు.
ముస్లింల శాంతి ర్యాలీ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): మహ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని మిలాద్ – ఉన్ – నబీ సందర్భంగా శుక్రవారం రాజమహేంద్రవరంలో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా ప్రవక్త ప్రవచనాలను వినిపిస్తూ, ధార్మిక నినాదాలు చేశారు. జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మహ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో 40 ఏళ్లుగా మిలాద్ – ఉన్ – నబీ సందర్భంగా శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది మహ్మద్ ప్రవక్త జన్మించి 1,500వ సంవత్సరం కావడం విశేషమన్నారు. కార్యక్రమంలో వేలమంది ముస్లింలు పాల్గొన్నారు.
వినాయక లడ్డూ రూ.36,500
అమలాపురం రూరల్: మండలంలో బండారులంక, మట్టపర్తివారిపాలెంలో నిలబెట్టిన సిద్ధి బుద్ధి సమేత వర సిద్ధి వినాయక స్వామి నవరాత్ర మహోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి వారి 15 కేజీల మహాలడ్డును వేలంపాటలో రూ.36,500లకు డి.రవితేజ, వెంకటలక్ష్మి, తులసి అర్జున్, దివ్య దంపతులు దక్కించుకున్నారు. పాటదారులను ఉత్సవ కమిటీ ప్రతినిధులు సత్కరించి లడ్డూను అందించారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు కడలి రాజు, కడలి రావకృష్ణ, బొంతు శ్రీనుబాబు, మట్టపర్తి అజయ్ కుమార్, మామిడిశెట్టి విష్ణు ప్రసాద్, మట్టపర్తి రాంబాబు, మట్టపర్తి కృష్ణ నాగేంద్ర, రాయుడు శ్రీనివాస్ పాల్గొన్నారు.
రేపు మధ్యాహ్నం వరకే
సత్యదేవుని దర్శనం
అన్నవరం: భాద్రపద పౌర్ణిమ, ఆదివారం రాత్రి 9–50 గంటలకు ఏర్పడనున్న చంద్రగ్రహణం కారణంగా అన్నవరం శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి దర్శనానికి ఆ రోజు మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారని ఈఓ వీ సుబ్బారావు శుక్రవారం తెలిపారు. ఆదివారం ఉదయం పది గంటల వరకు మాత్రమే స్వామివారి వ్రతాలు, కేశఖండన టిక్కెట్లు విక్రయిస్తారు. ఉదయం 12 గంటల వరకు మాత్రమే వ్రతాలు నిర్వహిస్తారు. స్వామివారి నిత్యకల్యాణం, వనదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యంగిర హోమం ఉదయం 11 గంటల లోపు పూర్తి చేస్తారు. సోమవారం సంప్రోక్షణ అనంతరం ఉదయం ఏడు గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.

కోటసత్తెమ్మ ఆలయం రేపు మూసివేత