పొగాకు.. గిట్టుబాటలో.. | - | Sakshi
Sakshi News home page

పొగాకు.. గిట్టుబాటలో..

Jul 8 2025 5:06 AM | Updated on Jul 8 2025 5:06 AM

పొగాక

పొగాకు.. గిట్టుబాటలో..

దేవరపల్లి: రెండు వారాలుగా పొగాకు మార్కెట్‌లో ధరలు పెరుగుతున్నాయి. నానాటికీ ధర పెరుగుతూండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత నెల 24వ తేదీ వరకూ మార్కెట్లో పంటకు గిట్టుబాటు ధర లభించక దిగాలు పడిన రైతులు ప్రస్తుత ధర చూసి కొంత వరకూ ఊపిరి పీల్చుకున్నారు. కిలో గరిష్ట ధర రోజురోజుకూ పెరుగుతూండటంతో పాటు లో గ్రేడు తప్ప మిగిలిన గ్రేడుల పొగాకు అమ్ముడుపోతోంది. లో గ్రేడు పొగాకులో కూడా నాణ్యమైన సరకును కొనుగోలు చేస్తున్నారు. బ్రైట్‌, మీడియం గ్రేడు పొగాకు ఎక్కువగా అమ్ముడు పోతోంది. ఈ రెండు గ్రేడుల పొగాకుకు మార్కెట్లో డిమాండ్‌ ఏర్పడటంతో కొనుగోలుదారులు పోటీ పడి మరీ కొనుగోలు చేస్తున్నారు. దీంతో, రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోందని అధికారులు అంటున్నారు. గత నెల 24వ తేదీ వరకూ కిలో పొగాకు గరిష్ట ధర రూ.290 పలకగా, అనంతరం అంచెలంచెలుగా పెరుగుతూ సోమవారం ఏకంగా రూ.336కు చేరింది. రెండు వారాల వ్యవధిలో కిలో గరిష్ట ధర రూ.46 పెరిగింది. కిలో కనిష్ట ధర రూ.220, సగటు ధర రూ.275.45 చొప్పున లభించినట్లు అధికారులు తెలిపారు.

అంతర్జాతీయ మార్కెట్లో గిరాకీ

అంతర్జాతీయ మార్కెట్లో మన పొగాకుకు డిమాండ్‌ ఏర్పడింది. ట్రేడర్లు మొన్నటి వరకూ వేలం కేంద్రాల్లో మొక్కుబడిగా పొగాకు కొనుగోలు చేసేవారు. అటువంటిది విదేశాలకు ఎగుమతి ఆర్డర్లు ఖరారు కావడంతో మార్కెట్లో కొనుగోలుదారులు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా ధర పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. ప్రతి రోజూ కిలో గరిష్ట ధర రూ.15 నుంచి రూ.20 వరకూ పెరుగుతోంది.

పెరుగుతున్న బేళ్లు

ధర పెరగడంతో వేలం కేంద్రాలకు తీసుకు వస్తున్న బేళ్ల సంఖ్య కూడా పెరిగింది. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్‌లోని ఐదు వేలం కేంద్రాలకు ప్రతి రోజూ 5 వేలకు పైగా బేళ్లు వస్తున్నాయి. సోమవారం దేవరపల్లి వేలం కేంద్రానికి 796, జంగారెడ్డిగూడెం–1కు 1,410, జంగారెడ్డిగూడెం–2కు 1,311, కొయ్యలగూడేనికి 1,146, గోపాలపురం వేలం కేంద్రానికి 829 చొప్పున బేళ్లు అమ్మకానికి వచ్చాయి. మొత్తం 5,492 బేళ్లు అమ్మకానికి రాగా, ట్రేడర్లు 4,118 బేళ్లు కొనుగోలు చేశారు. ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకూ రూ.734.90 కోట్ల విలువైన 26.68 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి.

రైతులకు అనుకూలంగా మార్కెట్‌

పొగాకు మార్కెట్‌ రైతులకు అనుకూలంగా కొనసాగుతోంది. దీనిని అందిపుచ్చుకుని రైతులు పంటను అమ్ముకోవాలి. నికోటిన్‌ శాతం ఎక్కువగా ఉన్న నాణ్యమైన గ్రేడు పొగాకు మార్కెట్‌కు రావడంతో ట్రేడర్లు పోటీ పడి కొనుగోలు చేస్తున్నారు. ఈ ధర ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. ఉన్నంత వరకూ రైతులు త్వరితగతిన పంటను అమ్ముకోవాలి. అన్ని రకాల గ్రేడులూ అమ్ముడుపోతున్నాయి.

– జీఎల్‌కే ప్రసాద్‌, పొగాకు బోర్డు రీజినల్‌

మేనేజర్‌, రాజమహేంద్రవరం

వేలం కేంద్రాల వారీగా పొగాకు విక్రయాలు (మిలియన్‌ కిలోలు)

దేవరపల్లి 4.31

జంగారెడ్డిగూడెం–1 6.28

జంగారెడ్డిగూడెం–2 5.83

కొయ్యలగూడెం 5.17

గోపాలపురం 5.07

పరుగులు పెడుతున్న మార్కెట్‌

కొనుగోలుకు పోటీ పడుతున్న ట్రేడర్లు

రూ.336 పలికిన కిలో గరిష్ట ధర

సగటు ధర రూ.275.47కు చేరిక

పొగాకు.. గిట్టుబాటలో..1
1/1

పొగాకు.. గిట్టుబాటలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement