
శృంగేరిలో పద్య రచనా శిక్షణ శిబిరం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కర్ణాటకలోని దక్షిణామ్నాయ శృంగేరి శ్రీ శారదా పీఠంలో జగద్గురువుల ఆదేశం మేరకు ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకూ ‘సాహిత్య శారదా’ అనే శీర్షికతో పద్య రచనా శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు. తెలుగు పద్య రచన నేర్చుకొనే ఆసక్తి ఉన్నవారు https://tinyurl.com/TeluguPadya వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ శిబిరంలో సుప్రసిద్ధ శతావధానులైన డాక్టర్ రాంభట్ల పార్వతీశ్వర శర్మ, డాక్టర్ తాతా సందీప్ శర్మ, విద్వాన్ గన్నవరం లలితాదిత్య శర్మ పాల్గొని, పద్య రచనలో మెళకువలు నేర్పిస్తారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
సంగీత, నృత్య పాఠశాలలో
ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): నగరంలోని విజయ శంకర ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలలో వివిధ కోర్సులకు గాను 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపాల్ ఎస్.నాగలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్ణాటక సంగీతం, గాత్రం, వాద్యం, నాట్యం, మృదంగం, డోలు, శాసీ్త్రయ నృత్య విభాగాల్లో నాలుగేళ్ల డిప్లొమా, రెండేళ్ల సర్టిఫికెట్ కోర్సులు నిర్వహించనున్నామన్నారు. కర్ణాటక సంగీతం, నాట్యం తదితర విభాగాల్లో ప్రతిభా ప్రదర్శన ఆధారంగా ఎంపిక పరీక్ష నిర్వహించి, విద్యార్థులను ఎంపిక చేస్తామని వివరించారు. సర్టిఫికెట్ కోర్సులో చేరే విద్యార్థుల వయస్సు ఈ నెల ఒకటో తేదీ నాటికి పదేళ్లు, డిప్లొమా కోర్సులో చేరే వారికి 15 సంవత్సరాలు నిండి ఉండాలన్నారు. దరఖాస్తుకు ఈ నెల 31 తుది గడువుగా పేర్కొన్నారు. మరింత సమాచారానికి 0883–2421669 ఫోన్ నంబర్‌లో కార్యాలయ పని వేళల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల్లోగా సంప్రదించాలని నాగలక్ష్మి సూచించారు.
బూత్ లెవెల్ అధికారులకు
నేటి నుంచి శిక్షణ
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా బూత్ లెవెల్ అధికారులకు బుధవారం నుంచి ఈ నెల 17వ తేదీ వరకూ శిక్షణ ఇవ్వనున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పి.ప్రశాంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి మొత్తం 1,581 మంది బూత్ లెవెల్ అధికారులు ఈ శిక్షణకు హాజరవుతారన్నారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో మొత్తం ఆరు బ్యాచ్‌లుగా వీరికి శిక్షణ ఇస్తామన్నారు. దీనికి బూత్ లెవెల్ అధికారులతో పాటు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, నమోదు అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. అనపర్తిలో 228, రాజానగరం 216, రాజమహేంద్రవరం రూరల్ 241, రాజమహేంద్రవరం అర్బన్ 176, కొవ్వూరు 205, నిడదవోలు 246, గోపాలపురంలో 269 మందికి శిక్షణ ఇస్తున్నామని కలెక్టర్ వివరించారు.
కేంద్ర పథకాలు
ప్రజలకు అందించాలి
రాజమహేంద్రవరం సిటీ: కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించి, వారు లబ్ధి పొందేలా చూడాలని ఎంపీ, జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ సంఘం (దిశ కమిటీ) చైర్మన్ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మంగళవారం జరిగిన దిశా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ, ఘన వ్యర్థాల నిర్వహణ, జల్‌జీవన్ మిషన్, అమృత్, ఫసల్ బీమా యోజన, పింఛన్లు, గృహ నిర్మాణం, క్షయ వ్యాధి నివారణ, పీఎం సూర్య ఘర్ పథకాలపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, కలెక్టర్ పి.ప్రశాంతితో కలసి అధికారులతో సమీక్షించారు. ప్రతి పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా, నమోదైన లబ్ధిదారుల సంఖ్య, పురోగతి అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

శృంగేరిలో పద్య రచనా శిక్షణ శిబిరం