
పిచ్చికుక్కల స్వైరవిహారం
కాట్రేనికోన/ అమలాపురం టౌన్: పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. కనిపించిన వారిపై దాడికి దిగాయి. ఈ ఘటనలు అమలాపురం, కాట్రేనికోన మండలం పల్లం గ్రామంలో జరిగాయి. బాధితుల కథనం ప్రకారం.. ఆదివారం పల్లం గ్రామంలో పిచ్చికుక్క దాడి చేయడంతో సుమారు 18 మంది గాయపడ్డారు. అక్కడ చేపల మార్కెట్ జరుగుతున్న సమయంలో మహిళలతో పాటు అధిక సంఖ్యలో వ్యాపారులు ఉండటంతో బెంబేలెత్తిపోయారు. బాధితులకు కాట్రేనికోన పీహెచ్‌సీ వైద్యురాలు నీలిమ ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం నిమిత్తం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అలాగే అమలాపురం కంసానికాలనీలో అదే ప్రాంతానికి చెందిన కుంచే శాన్విశ్రీ (9)పై వీధి కుక్క దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది. ఆ బాలికతో పాటు మరో వ్యక్తిని ఆ కుక్క కరిచింది. ఈ బాధితులిద్దరూ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. శాన్విశ్రీ కాళ్లు, నడుం, చేతులపై కుక్క కరవడంతో పట్టణ ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
19 మందికి గాయాలు
అమలాపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స