
రైతు కంట చెమ్మ
● పతనమైన నిమ్మ ధర ● కిలో రూ.7
● కోత కూలి కూడా రావడం లేదని ఆవేదన
● అంతంత మాత్రంగా ఎగుమతులు
దేవరపల్లి: నిమ్మకాయల ధర పతనమవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. కిలో నిమ్మకాయలకు రూ.7 నుంచి రూ.10 మధ్య మాత్రమే రైతులకు దక్కుతోంది. అదే వినియోగదారుల వద్దకు వచ్చేసరికి కిలో రూ.50 నుంచి రూ.55 వరకూ పలుకుతోంది. సైజును బట్టి ఒక్కో నిమ్మకాయ ధర రూ.2 నుంచి రూ.5 వరకూ కూడా చెబుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ధర భారీగా ఉన్నప్పటికీ తమకు మాత్రం దక్కుతున్నది చాలా స్వల్పంగా ఉందని రైతులు వాపోతున్నారు. ఈ ధర ఎంత మాత్రం గిట్టుబాటు కాదని, కోత కూలి డబ్బులు కూడా రావని ఆవేదన చెందుతున్నారు. దీనికితోడు నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తూండటంతో కాయల కోతలు జరగడం లేదు. నిమ్మకాయలు చెట్ల కింద రాలిపోయి ఉన్నాయి. సాధారణంగా వర్షాకాలంలో వినియోగం తక్కువగా ఉండటంతో, ఎగుమతులు నిలిచి, నిమ్మకాయలకు ధర కూడా తక్కువగా పలుకుతుంది. ఇదే సమయంలో తోటల నుంచి లేత కాపులు ఒకేసారి అందుకోవడంతో మార్కెట్‌కు కాయలు ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి. దీనికి తోడు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, టెక్కలి, నర్సన్నపేట ప్రాంతాల్లో వర్షాకాలంలో ఎక్కువగా మెట్ట నిమ్మకాయల దిగుబడి వస్తుంది. ఇవి అక్కడి మార్కెట్లను ముంచెత్తడంతో ఆయా ప్రాంతాలకు ఇక్కడి నుంచి ఎగుమతులు ఉండవు. దిగుబడి ఎక్కువగా ఉండడటం, డిమాండ్ లేక ఎగుమతులు తగ్గడంతో తమకు గిట్టుబాటు ధర దక్కడం లేదని, ప్రస్తుతం ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని రైతులు చెబుతున్నారు.
వేసవిలో గిరాకీ
ఈ ఏడాది వేసవిలో నిమ్మకాయలకు మంచి గిరాకీ ఏర్పడింది. కిలోకు రూ.60 నుంచి రూ.70 వరకూ రైతుకు దక్కింది. దిగుబడులు కూడా ఆశాజనకంగా వచ్చాయి. రైతులు పెట్టుబడులు, కౌలు డబ్బులు దక్క డంతో ఒడ్కెక్కారు. సాధారణంగా ఎండల తీవ్రత అ ధికంగా ఉండే ఫిబ్రవరి నుంచి జూన్ వరకూ మార్కె ట్లో నిమ్మకాయలకు గిరాకీ ఉంటుంది. జూలై నుంచి జనవరి వరకూ గిరాకీ అంతంత మాత్రంగానే ఉంటుంది. దేవరపల్లి మండలంలోని యాదవోలు మార్కె ట్ నుంచి ప్రతి రోజూ వివిధ ప్రాంతాలకు నిమ్మకాయ ల రవాణా జరుగుతుంది. ఇక్కడ రైతులే వ్యాపారు లుగా తయారై ఇతర రైతుల నుంచి ఎటువంటి కమీషన్ లేకుండా నిమ్మకాయలు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తూంటారు. దాదాపు 50 ఏళ్లుగా ఉన్న యాద వోలు నిమ్మ మార్కెట్‌కు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు ఉంది. సీజన్‌లో ఇక్కడి నుంచి రోజుకు సుమారు 100 టన్నుల నిమ్మకాయలు వివిధ ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. కొద్ది రోజుల కిందట 35 నుంచి 40 టన్నుల కాయలు మార్కెట్‌కు వచ్చేవి. ఇటీవలి వర్షాలకు రోజుకు 10 నుంచి 12 టన్నులు మాత్రమే వస్తున్నాయి. అయినప్పటికీ, డిమాండ్ లేకపోవడంతో రైతుకు ధర రావడం లేదు.
మంగు తెగులు
నిమ్మకాయలకు మంగు తెగులు, కాయ అడుగు భాగం మచ్చ (డాట్) వచ్చాయి. ప్రస్తుత వాతావరణానికి మంగు తెగులు ఎక్కువగా వ్యాపిస్తుంది. కాయలకు కోత కూలి డబ్బులు కూడా రావడం లేదు. ప్రస్తుతం మార్కెట్లో ధర పతనమైంది. మే 1 నుంచి 10వ తేదీ వరకూ కిలో రూ.35 నుంచి రూ.42 మధ్య పలికిన ధర అనంతరం రూ.20కి తగ్గింది. ఈ ధర గత నెలలో రూ.7 నుంచి రూ.10 మధ్యకు పడిపోయింది. ప్రస్తుతం అదే ధర కొనసాగుతోంది.
– అనిశెట్టి సూర్యచంద్రరావు, రైతు, యాదవోలు

రైతు కంట చెమ్మ