
పచ్చిరొట్టతో పచ్చధనం
జిల్లాలో పంట వివరాలు
పచ్చిరొట్ట సాగు భూములు: 40 వేల ఎకరాలు
పంపిణీ చేసిన విత్తనాలు: 400 టన్నులు
సాగు చేసిన రైతులు: 56 వేల మంది
దిగుబడికి వచ్చిన పశుగ్రాసం: 60 వేల టన్నులు
వచ్చిన ఆదాయం: సుమారు రూ.6 కోట్లు
ఫ మంచి ఫలితాలిస్తున్న సాగు
ఫ రైతుకు అదనపు ఆదాయం
ఫ ఎకరాకు 20 టన్నుల పశుగ్రాసం
ఫ బహుళ ప్రయోజనాలతో ఆనందం
పిఠాపురం: అవగాహన ఉంటే సాగులో సిరుల పంటే... కాలానుగుణంగా పంటలు వేస్తే అదనపు ఆదాయమే.. ఒకప్పుడు పచ్చిరొట్ట పంట అంటే ఏముందిలే అనుకునే వారు, ఇప్పుడు అదే అదనపు ఆదాయం తెచ్చే వనరు అయ్యింది. ఏటా రబీ పంట తర్వాత మండు వేసవిలో పొలాలను ఖాళీగా ఉంచేవారు. కానీ ప్రకృతి వ్యవసాయం పెరగడంతో ఎక్కడ చూసినా మండుటెండల్లో కూడా పచ్చని పంట పొలాలు కనిపిస్తున్నాయి. వేసవిలోనూ రైతులకు అదనపు ఆదాయం తెచ్చేలా, పశువులకు మేతగా, భూమికి పోషకాలు అందించే పచ్చిరొట్ట సాగుపై అవగాహన పెరిగింది. బహుళ ప్రయోజనాలు కలిగిన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్)– పచ్చిరొట్ట పంటలు సాగు చేసిన రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఏటా రబీ పూర్తయిన తర్వాత మే నెల 15 నుంచి జూన్ 30 లోపు ఈ పంటను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ పంట కాలం 45 రోజులు. ఈ ఏడాది పిఠాపురం వ్యవసాయ డివిజన్ పరిధిలో సుమారు 400 ఎకరాల్లో పచ్చిరొట్ట చేశారు. దీని కోసం ఎకరానికి 10 కిలోల చొప్పున ప్రకృతి వ్యవసాయ శాఖ రైతులకు నవధాన్యాల విత్తనాలను అందించింది. ఇటీవల దీనిని రైతులు సాగు చేశారు. మొత్తం 400 ఎకరాల్లో పీఎండీఎస్ విత్తనాలు మరింత సారవంతంగా మొక్కలు రావడంతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది.
అమ్మకం... ఆదాయం
పచ్చిరొట్ట పంట ఏపుగా పెరగడంతో రైతుకు అదనపు ఆదాయం సమకూరుతోంది. పంట బాగా రావడంతో ఎకరానికి సుమారు 20 టన్నుల వరకూ పోషక విలువలున్న పశుగ్రాసం లభ్యమైంది. ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ రైతుకు అదనపు ఆదాయం సమకూరుతోంది. వివిధ మిల్క్ డెయిరీలకు చెందిన యజమానులు పచ్చిరొట్ట పశుగ్రాసం కొనుగోలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా రోజూ 200 టన్నులకు పైగా పశుగ్రాసం అమ్మకాలు జరుగుతున్నాయి. ఒకపక్క భూమి సారవంతం కావడంతో పాటు మరోపక్క రైతుకు అదనపు ఆదాయం వస్తుండడంతో పచ్చిరొట్ట సాగుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
సాగు.. లాభాలు బాగు
పచ్చిరొట్ట సాగు చేసిన పంట పొలాల్లో అనూహ్య ఫలితాలు కనిపిస్తున్నాయి. భూసారం పెరగడంతో పాటు రైతుకు మంచి లాభాలను తెచ్చిపెడుతోంది. వీటి సాగుతో కలుపు నివారణ జరుగుతుంది. భూసారం పెరుగుతుంది, భూమి గుల్లబారి నీటి నిల్వ సామర్థ్యం అధికమవుతుంది. పురుగులు, తెగుళ్ల నివారణ, రైతు మిత్రులు వానపాముల వృద్ధి జరిగి మిత్ర పురుగుల శాతం పెరుగుతుంది. ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గి ఖర్చు ఆదా అవుతుంది. భూమి కోతకు గురి కాకుండా కాపాడుతూ పంట దిగుబడి బాగుంటుంది. భూతాపం తగ్గి విపత్తులను తట్టుకునే శక్తి వస్తుంది. నేల సేంద్రియ కర్భనం రెండు శాతం వరకూ పెరిగి సూక్ష్మజీవుల వైవిధ్యత పెరిగి అనేక పోషకాలు పైరుకు అందుతాయి. బీడు భూములు సారవంతమవుతాయి. వేసవిలో పశువులకు గ్రాసం అందుతుంది. పంట వేరు వ్యవస్థ పటిష్టంగా పెరిగి, పంట వాతావరణ ఆటుపోట్లను తట్టుకుని నిలబడుతుంది. జీవవైవిధ్యం పెరుగుతుంది. పంట ఉత్పత్తుల నాణ్యత, పోషక విలువలు పెరిగి రైతుకు అదనపు ఆదాయం తెచ్చిపెడుతుంది. 365 రోజులు భూమి కప్పబడి ఉండి సకాల వర్షాలకు దోపదపడుతుంది. ఈ గ్రాసం తీసుకున్న పశువుల్లో పాల దిగుబడి పెరుగుతుంది. పాలలో వెన్న శాతం అధికమవుతుంది. ఈ విధంగా ఇప్పటికే ఫలితాలు సాధించిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బాగా ఏపుగా పెరిగి..
నా పొలంలో రబీ అనంతరం పచ్చిరొట్ట సాగు చేశాను. మా పశువులకు మేత అయినా ఉంటుందిలే అనుకున్నాను. తీరా చూస్తే అది బాగా ఏపుగా పెరిగి మంచి పశుగ్రాసం తయారైంది. ఇలా పశువులకు బాగా మేత దొరికింది. ఇంతలో మిల్ డెయిరీల వారు వచ్చి మేత కొనుగోలు చేస్తామన్నారు. నా పొలంలో ఎకరానికి సుమారు 20 టన్నుల మేత వచ్చింది. వారు రూ.20 వేలకు ఎకరం పొలంలో ఉన్న పశుగ్రాసం తీసుకోవడానికి అంగీకరించి తీసుకెళుతున్నారు.
–తుమ్మలపల్లి వెంకటరమణ, రైతు, చేబ్రోలు, గొల్లప్రోలు మండలం
ప్రకృతి వ్యవసాయం వైపు
అడుగులు
పచ్చిరొట్ట సాగు మంచి ఫలితాలను ఇవ్వడంతో చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఇది మంచి పరిణామం. అయితే రైతులు పచ్చిరొట్ట పంటను భూమిలో కలియదున్నకుండా ముందుగా పశుగ్రాసం తీసుకుని మిగిలిన వ్యర్థాలను కలియ దున్నుకోవడం ద్వారా ఆదాయం వస్తుంది. మంచి ఫలితాలు భూమికి అందుతాయి. పచ్చిరొట్ట సాగుతో జిల్లాలో పశుగ్రాసం ఒక్కసారిగా పెరిగింది. ఇది పాడి పరిశ్రమకు మంచిది.
–ఎలియాజర్, ప్రకృతి వ్యవసాయ శాఖ
డీపీఎం, కాకినాడ

పచ్చిరొట్టతో పచ్చధనం

పచ్చిరొట్టతో పచ్చధనం

పచ్చిరొట్టతో పచ్చధనం

పచ్చిరొట్టతో పచ్చధనం