మత్తులో చెలరేగిపోయారు! | - | Sakshi
Sakshi News home page

మత్తులో చెలరేగిపోయారు!

Jul 1 2025 4:06 AM | Updated on Jul 1 2025 4:06 AM

మత్తు

మత్తులో చెలరేగిపోయారు!

యువత ఒకరిపై ఒకరు దాడులు

జాతరలో అశ్లీల నృత్యాలు

పెద్దాపురం పట్టణంలో ఘటన

పెద్దాపురం: మద్యం, గంజాయి మత్తులో చెలరేగిపోయారు.. రోడ్లపై ఇష్టారాజ్యంగా వ్యవహరించారు.. కూటమి ప్రభుత్వంలో కొందరి అండతో ఈ తంతు యథేచ్ఛగా సాగిందనడానికి ఆదివారం అర్ధరాత్రి పెద్దాపురం పట్టణంలో జరిగిన ఘటనే నిదర్శనం. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఎంతో భక్తిభావంతో పెద్దాపురం మరిడమ్మ వారి ఆషాఢమాస ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీధి సంబరాలు జరుగుతుండడం ఆనవాయితీ వస్తోంది. ఇందులో భాగంగా తొలి ఆదివారం స్థానిక దర్గా సెంటర్‌ చేపల వీధి సంబరం జరిగింది. ఇక్కడ యువతులతో అశ్లీల నృత్యాలు చేయించారు. ఇది పోలీసుల ముందే జరగడం విశేషం. డీజే పేరిట డ్యాన్స్‌లతో హోరెత్తించారు. ఇదిలా ఉంటే ఇక్కడ మద్యం, గంజాయి తాగిన కొందరు యువకులు పరస్పర దాడులకు దిగి భయంకర వాతావరణాన్ని సృష్టించారు. ఆ యువకులు సుమారు మూడు చోట్ల స్టేజీ సమీపంలోనే ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. విచక్షణా రహితంగా కొట్టుకోవడంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ మౌనిక, తన సిబ్బంది వచ్చి వారిని తరిమేయడంతో యువత చెల్లాచెదురయ్యారు. తర్వాత ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్న చోటే మళ్లీ రక్తం చిందేలా కొట్టుకున్నారు. పరస్పర దాడులకు దిగారు. ఈ ఘటనల్లో సుమారు 15 మందికి గాయాలు కాగా, మూడు ఘటనలకు సంబంధించి ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. అశ్లీల నృత్యాల నిర్వహణకు స్థానిక కూటమి నేతల ఒత్తిళ్లే కారణమని, అందుకే పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎటువంటి కేసూ నమోదు కాకపోవడం గమనార్హం.

మద్యం మత్తులోనే ఘర్షణ

స్థానిక చేపల వీధి సంబరంలో తగదా పడిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. సోమవారం రాత్రి ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆ వివరాలను వెల్లడించారు. సంబరాన్ని తిలకించేందుకు వచ్చిన ఇరువురు యువకుల మధ్య జరిగిన వాగ్వాదం చినికి చినికి గాలివానలా మారి ఘర్షణ చోటుచేసుకుందన్నారు. ఇరువురూ మద్యం మత్తులో ఉన్నారని, సోషల్‌ మీడియాలో వాటిని వక్రీకరిస్తూ గంజాయి మత్తు అంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఆ వార్తల్లో వాస్తవం లేదని, కేవలం మద్యం మత్తులో మాత్రమే ఆ యువకులు తీవ్రంగా గాయపర్చుకున్నారన్నారు. పెద్దాపురానికి చెందిన బాలుడు, రాజమహేంద్రవరం సీతంపేట ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన చుక్కా దుర్గారావును అదుపులోకి తీసుకుని ఇద్దరిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వీధి సంబరాల్లో ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పట్టణంలో గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో సీఐ విజయశంకర్‌, ఎస్‌ఐ మౌనిక పాల్గొన్నారు.

మత్తులో చెలరేగిపోయారు! 1
1/1

మత్తులో చెలరేగిపోయారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement