
ఆయురారోగ్యాల్లో మునగంగా!
● ఆషాఢంలో మునగ వంటకాలకు ప్రాధాన్యం
● ఎన్నో విశిష్టతల మహోన్నత మాసం
ఆలమూరు: తొలకరి జల్లులతో ప్రకృతి శోభను తీసుకువచ్చే ఆషాఢ మాసానికి చారిత్రాత్మకమైన ప్రత్యేకత ఉంది. శుభప్రదమైన ఈ మాసంలో శుభకార్యాలు లేకపోయినా ఆధ్యాత్మికతతో కూడిన సందడి ఉంటుంది. హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహరాలకు ఈ మాసం ప్రతీకగా నిలుస్తోంది. గ్రామీణులకు ఆరాధ్యులైన గ్రామ దేవతలకు జాతరలు, నైవేద్యాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఆకాశంలో మేఘావృతమయ్యే మబ్బులు, పిడుగు పాటు శబ్దాలు, చిరుజల్లులతో ఆహ్లాదకరమైన వాతావరణం ఈ మాసం సొంతం. ఆషాఢమాసంలో లభించే నేరేడు పండ్లు, తాటికాయలు తదితర పోషక పదార్థాలు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ప్రకృతి సిద్ధంగా లభించే లేత మునగాకుతో తయారు చేసే ప్రత్యేక వంటకాలు సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ మాసంలో ఆదివారం వస్తే ప్రతి ఇంట్లో మునగాకు పప్పు లేదా తెలగపిండి మునగాకు కూర చేసుకుని తినడం రివాజుగా మారిపోయింది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజానీకం ఇటువంటి సంప్రదాయాలు నేటికీ కొనసాగిస్తూ భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆషాఢ మాసం అందరికీ ఇష్టమైనప్పటికీ నవ దంపతులకు మాత్రం ఈనెల రోజులు ఎడబాటుకు కారణమవుతుంది. నాటి సంప్రదాయాలతో పాటు భావి తరాలు, ఆరోగ్య పరిరక్షణ కోసం శాసీ్త్రయ దృక్పథంతో పాటు ఆధ్యాత్మికతతో ఆరోగ్య సూత్రాలను మిళితం చేసి ఆహార నియమాలను ఏర్పాటు చేశారని పండితులు చెబుతుంటారు.
ఆఫర్ల హంగామా కూడా ఈ నెలలోనే
ఆషాఢం వస్తోందంటే కార్పొరేట్ స్థాయికి చెందిన ప్రముఖ వస్త్రాలయాలు, జ్యూయలరీ సంస్థలు ఇచ్చే ఆఫర్ల కోసం ప్రజలు ఎదురు చూస్తుంటారు. నేటి యువతరం ఆషాఢ మాసంలో వచ్చే ఆఫర్ల గురించి తెలిసినంతగా ఈ నెల విశిష్టత గురించి తెలుసుకోకపోవడం శోచనీయమని పలువురు ఆధ్యాత్మిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మునగాకు వంటకాలు తప్పసరి
ఆషాఢ మాసంలో మునగాకును తప్పనిసరిగా తినడతం వల్ల అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. ఇలా ఆషాడంలో మునగాతో కలిపిన కూరలు తినడం వల్ల ఒంటికి వేడి చేసి వర్షాకాలంలో కురిసే వర్షాలకు చలువ చేసే ఒంటిని సమ శీతోష్ణ స్థితిలో ఉంచుతుందని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. వర్షాకాలంలో మునగాకు లేతగా దొరకతుండటంతో తినడానికి అనుకూలంగా ఉంటుంది. దీని వల్ల ఒంటికి ఎన్నో పోషక విలువలు అందుతాయి. అస్తమా, ఊపిరితిత్తుల వ్యాధులను కూడా నివారిస్తుంది. అలాగే మునగాకు బాలింతలకు, గర్భిణులకు అవసరమయ్యే విటమిన్ ఎ అందించి కంటి సమస్యలను నివారిస్తుందని ప్రకృతి వైద్యులు చెబుతుంటారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఈ మునగాకు కొంచెం చేదు, వగరు రుచుల కలగలిపి ఉండటంతో మహిళలు ఎక్కువగా కందిపప్పు, పెసరపప్పు తదితర వాటితో వంటకాలు చేసి వాడుతుంటారు. మరి కొంతమంది శ్రేష్టమైన నువ్వులతో తయారైన తెలగపిండితో మునగాకును కలిపి కూర చేసుకుని తింటారు.

ఆయురారోగ్యాల్లో మునగంగా!

ఆయురారోగ్యాల్లో మునగంగా!

ఆయురారోగ్యాల్లో మునగంగా!