
ఖరీఫ్ ముగిశాకే..
అన్నవరం: పంపా రిజర్వాయర్‌కు కొత్త గేట్ల ఏర్పాటు పనులు మరింత జాప్యం కానున్నాయి. ఇప్పటికే ఈ పనులు పూర్తి చేయాల్సి ఉండగా పలు కారణాలతో ఆలస్యం చోటు చేసుకుంది. ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లోని 12,500 ఎకరాలకు పంపా రిజర్వాయర్ నుంచి సాగు నీరు అందిస్తారు. దీంతో పాటు అన్నవరం దేవస్థానానికి, గ్రామానికి కూడా నీరు అందిస్తారు. పంపా జలాశయం గేట్ల నిర్వహణ చాలా కాలం నుంచే ఇబ్బందికరంగా మారింది. వరద నీరు సముద్రంలోకి వదిలే సమయంలో గేట్లు ఎత్తేందుకు, నీటిమట్టం తగ్గినపుడు ఎత్తిన గేట్లు దించేందుకు చాలా సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కొత్త గేట్లు అమర్చాలని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2023 జూలైలో రూ.3.36 కోట్లతో అంచనాలు రూపొందించి, నిధులు కేటాయించారు. గత ఏడాది మార్చి నుంచి సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో నిధులు విడుదల కాలేదు. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్‌లో నిధులు విడుదల చేసింది. కొత్త గేట్ల ఏర్పాటుకు మూడుసార్లు టెండర్లు పిలిచారు. కానీ, ఎవ్వరూ రాలేదు. చివరిగా ఏప్రిల్‌లో షార్ట్ టెండర్ పిలవగా తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన గోపాలకృష్ణ ఏజెన్సీ 4.75 శాతం ఎక్కువకు టెండర్ దక్కించుకుంది. ఇదే సమయంలో వర్షాలు మొదలైపోవడంతో పనుల్లో మళ్లీ జాప్యం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రిజర్వాయర్‌కు ఉన్న ఐదు గేట్లలో అత్యంత సమస్యాత్మకంగా ఉన్న 4వ నంబర్ గేటుకు మాత్రమే ప్రస్తుతం మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. మిగిలిన నాలుగు గేట్లకు తాత్కాలిక మరమ్మతులు చేస్తారు. ఖరీఫ్ అనంతరం ఐదు గేట్లు కొత్తవి అమర్చుతారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంపా జలాశయంలోకి పెద్ద మొత్తంలో నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం గురువారం సాయంత్రానికి 87.5 అడుగులకు చేరింది. ఇంకా ఇన్‌ఫ్లో వస్తున్న నేపథ్యంలో వారం రోజుల్లోగా 4వ నంబర్ గేటు మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. గేట్లకు మరమ్మతులు, కొత్త గేట్ల ఏర్పాటుపై పది రోజుల క్రితమే అధికారులతో కలిసి నిపుణుడు సారథి పరిశీలించారు. అలాగే, ఈఈ శేషగిరిరావు, ఇతర అధికారులు, గేట్ల మరమ్మతులు చేసే కాంట్రాక్టర్ సిబ్బంది బుధవారం పరిశీలన జరిపారు.
పంపా బ్యారేజీకి కొత్త గేట్ల
ఏర్పాటులో జాప్యం
ప్రస్తుతం 4వ నంబర్ గేటుకు
తాత్కాలిక మరమ్మతులు
87.5 అడుగులకు చేరిన నీటిమట్టం