
రుచి మధురం.. రైతుకు లాభం
మలికిపురం: మామిడి తోటల నుంచి అధిక దిగుబడి సాధించడానికి రైతులు అనేక చర్యలు చేపడతారు. కాయలు రాలిపోకుండా, బాగా పెరిగేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం మామిడి సాగులో కవర్ కల్చర్ ఎక్కువగా కనిపిస్తోంది. గత మూడేళ్లుగా ఈ విధానంలో అమల్లో ఉన్నప్పటికీ ఇటీవల బాగా వెలుగులోకి వచ్చింది. తోటల నుంచి దిగుబడి మెరుగ్గా ఉండడంతో రైతులందరూ ఈ విధానం ఆచరిస్తున్నారు.
ప్రత్యేక శ్రద్ధ
రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఈ కవర్ కల్చర్ విధానం ఉన్నప్పటికీ మామిడిలో మేలు జాతి అయిన బంగినపల్లి సాగులో ఎంతో మేలు చేస్తోంది. సాధారణంగా రైతులు, లీజుదారులు కూడా బంగినపల్లి మామిడిపై అధికంగా పెట్టుబడితో పాటు లాభాలపై ఆశలు పెట్టుకుంటారు. అయితే ఈ రకంపై చీడ పీడల కారణంగా నష్టపోతున్నారు.బంగినపల్లి మామిడి పండ్లకు మలికిపురం మండలంలోని గూడపల్లి ఎంతో ప్రసిద్ధి చెందింది. గూడపల్లి కేంద్రంగా రాజోలు దీవిలో పలు గ్రామాలలో సాగవుతున్న బంగినపల్లి మామిడికి రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో ఇక్కడ సాగయ్యే బంగినపల్లి మామిడిపై రైతులు, వ్యాపారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
మంచి ధర
కవర్ కల్చర్ విధానంలో సాగు చేసిన మామిడి కాయలకు ధర ఎక్కువగానే లభిస్తుంది. సాధారణ విధానంలో సాగైన బంగినపల్లి మామిడికి సంబంధించి నూజివీడు మార్కెట్‌లో మంగు కాయ కేజీ రూ.15 నుంచి రూ.20 వరకూ ఉంటుంది. మేలైన కాయ కేజీ రూ.40 వరకూ పలుకుతుంది. అయితే గూడపల్లిలో బంగిన పల్లి కాయ ధర రూ.70 వరకూ ఉంటుంది. కవర్ కల్చర్‌లో పెరిగిన మామిడి కాయ గూడపల్లిలో ఏకంగా కేజీ రూ.130 నుంచి 160 వరకూ ధర పలుకుతోంది. వీటిని కూడా నేరుగా తోటల వద్దకు వచ్చి కొనుగోలు చేసుకుంటున్నారు. ఫోన్‌లో ఆర్డర్లు చేసి ట్రాన్స్‌పోర్టు చేయించుకుంటున్నారు. సాధారణంగా బంగినపల్లి మామిడికి రుచి ఎక్కువ. రాజోలు దీవిలోని గూడపల్లి బంగినపల్లికి మరింత రుచి ఉంటుంది.
ఎర్రని నేలలు
రాజోలు దీవిలోని పలు గ్రామాలలో ఎర్రని ఇసుక నేలల ఉండడం వల్ల ఇక్కడ బంగిన పల్లికి రుచి ఎక్కువగా ఉంటుందని పూర్వీకులు చెబుతున్నారు. దీంతో ఇక్కడి కాయలకు ధర కూడా ఎక్కువే. వాతావరణ మార్పుల రీత్యా రాజోలు దీవిలో మామిడి చెట్లు ఆలస్యంగా కాపునకు వస్తాయి. ఏప్రిల్‌లో పూత పూస్తాయి. సీజన్ చివర జూన్‌లో దిగుబడి వస్తాయి. కానీ వర్షాలు మొదలు కావడంతో గూడపల్లి కాయలు మే చివరి నాటికే పక్వానికి చేరుకున్నాయి. జోరుగా ఎగుమతులు సాగుతున్నాయి. రాజోలు దీవి నుంచి ప్రతి ఏడాది సుమారు పది వేల టన్నుల బంగినపల్లి రకం బయట ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది.
దిగుబడి బాగుంది
కవర్ కల్చర్ విధానంలో మూడేళ్లుగా బంగినపల్లి మామిడిని సాగు చేస్తున్నాను. కృష్ణా జిల్లాతో పాటు రాజోలు దీవిలోని గూడపల్లి పరిసర ప్రాంతాలలో ఈ పద్ధతి పాటిస్తున్నారు. దీనివల్ల దిగుబడి చాలా బాగుంది. ఎక్కువ ఆదాయం వస్తోంది.
– గట్టెం సూరిబాబు, రైతు, తూర్పుపాలెం
మామిడి సాగులో కవర్ కల్చర్
ఆశాజనకంగా దిగుబడి
చీడపీడల నుంచి రక్షణ
బంగినపల్లి రకానికి ఎంతో అనుకూలం
సాగు ఇలా..
సాధారణంగా ఫిబ్రవరిలో పూతకు వచ్చే మామిడికి అంతకు ముందు డిసెంబర్, జనవరి నెలల్లో చీడపీడలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. మార్చి నెలాఖరుకు, ఏప్రిల్‌లో పిందె దశకు చేరుకుంటుంది.
పిందె వంద గ్రాములు అయ్యాక ప్రత్యేకమైన కవర్‌ను ఆ పిందెకు కడతారు. ఇక పండు తయారయ్యే వరకూ దాన్ని తీయరు. దీనివల్ల ఆ మామిడిని ఏ విధమైన చీడపీడలు ఆశించవు.
కవర్ వేయడం వల్ల ఈదురుగాలులకు కాయ రాలిపోదు. ఒకవేళ రాలిపోయినా కాయ పాడవదు. నిర్ణీత సమయానికి పక్వానికి వచ్చిన కాయలను కోసి ఎగుమతి చేసుకోవచ్చు.
ఇవి సాధారణ కాయల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పురుగు పట్టకుండా నాణ్యతగా ఉంటాయి. దిగుబడి కూడా రెట్టింపు ఉంటుందని రైతులు చెబుతున్నారు.
మామూలుగా చీడపీడల వల్ల సగానికి పైగా కాయలు.. పిందె దశలోనే రాలి పోతాయి. అయితే కవర్ కల్చర్ వల్ల పురుగు చేరకుండా మామిడి పెరుగుతుంది. నష్టం పెద్దగా ఉండదు. కేవలం ఒక్కొక్క కవర్‌కు రూ.2.50 మాత్రమే ఖర్చవుతుంది. వీటిని కాయకు కట్టేందుకు మరో రూ.2.50 అవుతుంది.

రుచి మధురం.. రైతుకు లాభం

రుచి మధురం.. రైతుకు లాభం

రుచి మధురం.. రైతుకు లాభం

రుచి మధురం.. రైతుకు లాభం