
కూటమి పాలన అవినీతిమయం
మలికిపురం: కూటమి ప్రభుత్వ పాలనంతా అవినీతిమయమేనని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. మలికిపురంలో పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ రూ.3 వేలకు పెంచిన పింఛన్‌ను కాస్త పెంచి ఇస్తున్న పథకం తప్ప, ఇంకా ఏమైనా రాష్ట్రంలో ఉందా చంద్రబాబూ అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా అమలు చేశావా అని నిలదీశారు. ప్రశ్నిస్తున్న వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రస్తుత వేసవిలో అనేక ఉపాధి హామీ పనులు చేయాల్సి ఉండగా ఆ పథకాన్ని అవినీతిమయం చేశారన్నారు. చింతలపల్లి రోడ్డుకు రూ.7 కోట్లను మాజీ సీఎం జగన్ మంజూరు చేయిస్తే పనులు ప్రారంభించినట్లే నటించిన కూటమి ప్రభుత్వం.. బెర్మ్ తవ్విన మట్టిని అధికారులు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ వనరులు దోచేస్తున్నా వ్యవస్థలు ఏం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్టు మెషీన్ల పేరుతో రాష్ట్రంలో భారీ దోపిడీ జరిగిందన్నారు. సమావేశంలో అడబాల వీర బ్రహ్మజీ, కుసుమ చంద్రశేఖర్, అడబాల జానకీ రామ్, తాడి సహదేవ్, నామన మణికంఠ, జిల్లెళ్ల ఉదయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.