
ప్చ్... ఎండు మిర్చి!
దేవరపల్లి: ఎండు మిర్చి ధర పతనమైంది. అయినా మిర్చిని అడిగే నాథుడు కనిపించడంలేదు. అధిక పెట్టుబడులతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో కళ్లాలో రైతులు దిగాలుగా ఉన్నారు. ఈ ఏడాది మిరప తోటలకు పూతదశలో పేను, ఎర్రనల్లి వంటి చీడపీడలు సోకాయి. దీంతో పూతలు దెబ్బతిన్నాయి. రూ.వేలకు వేలు ఖర్చు పెట్టి పూతను కాపాడటానికి రైతులు మందులు పిచికారీ చేశారు. ప్రయోజనం శూన్యం. దీంతో దిగుబడులు గణనీయంగా తగ్గాయి. వాతావరణ పరిస్థితులు, ప్రకృతి అనుకూలిస్తే దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. సాధారణంగా ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది మిర్చి పంటకు ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో కాపులు లేక దిగుబడులు పడిపోయాయి. ముదర కాపులు ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్లు దిగుబడులు వచ్చాయి. ఏటా సంక్రాంతికి మిరపతోటలు పూత, పిందెలతో ఉంటాయి. ఈ ఏడాది పూతలు దెబ్బతినడంతో రైతులు ఆశించిన స్థాయిలో పిందె ఏర్పడలేదు. ఫిబ్రవరి రెండవ వారం నుంచి ఎండు మిర్చి విక్రయాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో కిలో రూ.600 పలికింది. ఈ ధర ఏప్రిల్ వరకు ఉంది. మే నెల నుంచి ధర పడిపోవడంతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు.
1,250 ఎకరాల్లో మిర్చి సాగు
గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం మండలాల్లో రైతులు వేసవి పంటగా ఎండు మిర్చి సాగు చేస్తున్నారు. మూడు మండలాల్లో సుమారు 1200 ఎకరాల్లో మిర్చి సాగు జరుగుతోంది. దేవరపల్లి మండలంలో పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం, కొత్తగూడెం, దేవరపల్లి గ్రామాల్లో మిరప పంట సాగు చేస్తున్నారు. పల్లంట్ల, కురుకూరు గ్రామాల్లో ప్రధాన పంటగా రైతులు మిర్చిని పండిస్తుంటారు. రెండు గ్రామాల్లో సుమారు 400 ఎకరాల్లో పంట సాగు చేసినట్టు అధికారుల అంచనా. దాదాపు నాలుగు దశాబ్దాలుగా మిరప పంట సాగు చేస్తున్నట్టు రైతులు తెలిపారు. తుపానులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా వాతావరణం అనుకూలించకపోవడం వల్ల తోటలు దెబ్బతిని రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. దిగుబడులు ఉంటే పంట లాభదాయకమేనని రైతులు అంటున్నారు. మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా కౌలు రైతులు నష్టపోతున్న పరిస్థితి. పల్లంట్ల, కురుకూరు ఎండు మిర్చికి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉండేది. ఇప్పటికి పల్లంట్ల ఎండు మిర్చికి మార్కెట్లో బ్రాండ్ ఇమేజ్ ఉంది. అయితే తోటలకు చీడపీడలు ఎక్కువగా ఆశించడంతో పురుగు మందుల వాడకం ఎక్కువ కావడం, పంట మార్పిడి జరగకపోవడం వల్ల భూముల్లో సారం తగ్గడం వంటి కారణాల వల్ల ఇక్కడ కూడా మిర్చి నాణ్యత, కారం ఘాటు తగ్గినట్టు రైతులు తెలిపారు.
లేత కాపులు అందుకున్నా ధర లేదు
ముదర కాపులు దిగుబడులు లేక నష్టపోయిన రైతులకు లేత కాపులు కొంత వరకు ఊరట నిచ్చాయి. ఏప్రిల్ నుంచి తోటలు చీడపీడల నుంచి కోలుకోవడంతో లేత కాపులు దిగినట్టు రైతులు తెలిపారు. ఎండు మిర్చి సీజన్ ముగియడంతో లేత కాపులకు ధర లేదని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఎకరాకు సుమారు రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టి పంట పండించారు. ఎకరం కౌలు రూ.50 వేల నుంచి 70 వేలు పలికింది. పండిన పంటను అమ్మితే రూ. లక్ష రావడం కష్టంగా ఉందని రైలులు లబోబోదిబోమంటున్నారు. లేతగా వచ్చిన పంటకు ధర లేదని రైతులు వాపోతున్నారు. సీజన్ ముగిసినా కళ్లాలో ఎక్కడ మిర్చి అక్కడే ఉంది.
ధర లేక రైతుల దిగాలు
కంట కన్నీరు తెప్పిస్తున్న సాగు
కిలో రూ.600 నుంచి రూ.150కు పతనం
అందుకున్న లేత కాపులు
కౌలు రైతులకు కోలుకోని నష్టం
ఎకరాకు రూ. లక్ష నష్టం
కళ్లాల్లోనే నిల్వలు
తక్కువ ధరకు కర్ణాటక మిర్చి
జిల్లాకు ఇతర ప్రాంతాల నుంచి సీజన్‌లో వ్యాపారులు ఎండు మిర్చిని దిగుమతి చేసుకుని తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. కర్ణాటక, భద్రాచలం, గుంటూరు, తాడేపల్లిగూడెం ప్రాంతాల నుంచి ఈ ఏడాది వ్యాపారులు ఈ ప్రాంతానికి ఎండు మిర్చిని తీసుకు వచ్చి తక్కువ ధరకు విక్రయాలు జరిపారు. పల్లంట్ల, కురుకూరు గ్రామాల్లో కిలో ధర రూ.600 పలకగా, సైకిల్ వ్యాపారుల వద్ద రూ.200 నుంచి రూ.250కి లభించింది. ధరలో భారీ వ్యత్యాసం ఉండడంతో ప్రజలు తక్కువ ధరకు దొరుకుతున్న మిర్చిని కొనుగోలు చేశారు.
కోలుకోవడం కష్టం
మిర్చి రైతులు కోలుకోవడం కష్టం. కౌలుదారుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పెట్టిన పెట్టుబడులు కూడా రాలేదు. ముదర కాపులు దెబ్బతినడంతో దిగుబడులు తగ్గాయి. ఎకరాకు రూ.1.50 లక్షల పెట్టుబడి అయింది. పురుగు మందుల ఖర్చు ఎక్కువైంది. ఎన్ని మందులు కొట్టినా పూతలు నిలబడలేదు. ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట వేశాను. ఎకరా కౌలు రూ.50 వేలు, పెట్టుబడి రూ. లక్ష అయింది. ఆరు ఎకరాల సాగుకు సుమారు రూ.10 లక్షలు ఖర్చుకాగా, వచ్చిన ఆదాయం రూ.5 లక్షలు మాత్రమే. లేత కాపులు ప్రస్తుతం కిలో రూ.150 నుంచి రూ.200 పలుకుతున్నాయి.
– నూతలపాటి రమేష్, రైతు, పల్లంట్ల, దేవరపల్లి మండలం
గిట్టుబాటు కావడంలేదు
మిర్చి పంట సాగు గిట్టుబాటు కావడంలేదు. తోటలకు చీడపీడలు, తెగుళ్లు ఎక్కువగా ఆశించి పూతలు దెబ్బతింటున్నాయి. రెండేళ్లుగా ఎండు మిర్చికి ధర ఉన్నప్పటికి దిగుబడి లేక నష్టం వస్తోంది. నేను 4 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట వేశాను. కౌలు, పెట్టుబడి ఎకరాకు రూ.1.50 లక్షలు అయింది. కౌలు డబ్బు కూడా రాని పరిస్థితి. ఇతర ప్రాంతాల నుంచి ఎండు మిర్చిని తీసుకు వచ్చి సైకిల్ వ్యాపారస్తులు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. మా గోడును పట్టించుకున్న నాథుడు లేడు.
– కాసాని సత్యనారాయణ, కౌలు రైతు, పల్లంట్ల, దేవరపల్లి మండలం

ప్చ్... ఎండు మిర్చి!

ప్చ్... ఎండు మిర్చి!

ప్చ్... ఎండు మిర్చి!