
వక్ఫ్ చట్ట సవరణపై నిరసన హోరు
ఫ రాజమహేంద్రవరంలో ముస్లింల భారీ ర్యాలీ
ఫ ఈ చట్ట సవరణ రాజ్యాంగ విరుద్ధమన్న నేతలు
ఫ ఈ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతుపై ఆగ్రహం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వక్ఫ్ చట్ట సవరణ పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. దీనికి వ్యతిరేకంగా రాజమహేంద్రవరంలో ముస్లింలు వేలాదిగా మంగళవారం కదం తొక్కారు. వక్ఫ్‌ను కాపాడాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, అన్ని మతాల ఐక్యత వర్ధిల్లాలని, దేవుని ఆస్తి అయిన వక్ఫ్‌పై రాజకీయం తగదని, ఇది దేశ భవిష్యత్తుకు ప్రమాదమని ప్లకార్డులు చేబూని, వేలాదిగా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. వక్ఫ్ చట్టం–2025ను రద్దు చేయాలని ముక్తకంఠంతో నినదించారు. ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యాన జరిగిన ఈ ర్యాలీలో ముస్లిం మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలోని జాంపేట ఆజాద్ చౌక్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ అప్సరా థియేటర్ మీదుగా కోటిపల్లి బస్టాండ్, డీలక్స్ సెంటర్, మెయిన్ రోడ్డు రాయల్ మాస్క్ మీదుగా తిరిగి జాంపేట చేరింది. అనంతరం జరిగిన సభలో ముస్లిం ఐక్య వేదిక కన్వీనర్ హబీబుల్లాఖాన్ మాట్లాడుతూ, ముస్లింలు హక్కులను ప్రధాని మోదీ కాలరాస్తున్నారని అన్నారు. ఇలాంటి బిల్లుకు చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు మద్దతు పలకడం సిగ్గుచేటని, ఈ బిల్లుకు టీడీపీ, జనసేన మద్దతు ఇస్తూ చేయవలసినదంతా చేసేసి, ముస్లిం సమాజానికి తప్పుడు సమాచారం ఇస్తున్నారని దుయ్యబట్టారు. వక్ఫ్ కమిటీల్లో అన్య మతస్తులకు చోటు కల్పిస్తున్నారన్నారు. కలెక్టర్లకు తుది నిర్ణయం ఉండదని చెబుతూనే ఉన్నత స్థాయి అధికారులను నియమిస్తామనడంలో మతలబు ఏమిటని ప్రశ్నించారు. ఈ ఉన్నతాధికారులు కూడా ఆయా ప్రభుత్వాల చెప్పుచేతల్లో ఉంటారన్నారు. ఈ చట్టంపై ప్రతిపక్షాల వాదనలను, ముస్లిం సమాజ అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ, టీడీపీ ఎంపీలు మద్దతివ్వడం వల్లనే లోక్‌సభలో వక్ఫ్ బిల్లు పాసయ్యిందని అన్నారు. ఎన్నికల ముందు శ్రీనారా హమారాశ్రీ అని నమ్మబలికి ఓట్లు వేయించుకున్న చంద్రబాబు ముస్లింలను మరోసారి మోసం చేశారని విమర్శించారు. ఆయన నైజాన్ని ప్రతి ముస్లిం గుర్తు పెట్టుకోవాలని కోరారు. వక్ఫ్ బోర్డు జిల్లా మాజీ అధ్యక్షుడు ఎండీ ఆరిఫ్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ముస్లింలను కూటమి ఎంపీలు మరోసారి మోసం చేశారన్నారు. వేదిక కో కన్వీనర్ అన్సర్ మాట్లాడుతూ, నల్లచట్టాలు రూపొందించి, ముస్లింలను ఏదో ఒక రకంగా అణచివేయాలని చూస్తున్నారన్నారు. ఈ ర్యాలీలో రాయల్ మాస్క్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ కరీమ్, మాజీ అధ్యక్షుడు షేక్ అసదుల్ల అహ్మద్, వక్ఫ్ జిల్లా కమిటీ మాజీ అధ్యక్షుడు ఎండీ రెహమాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

వక్ఫ్ చట్ట సవరణపై నిరసన హోరు