
నన్నయను సందర్శించిన గుజరాత్ వీసీ
రాజానగరం: గుజరాత్‌లోని బిర్సా ముండా గిరిజన యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ఆచార్య మధుకర్భాయ్ ఎస్.పృథ్వి మంగళవారం ఆదికవి నన్నయ యూనివర్సిటీని సందర్శించారు. నన్నయ వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీని కలుసుకుని, యూనివర్సిటీ విద్య, అభివృద్ధి తదితర విద్యా పరమైన అంశాలపై చర్చించారు. వీడియో కాన్ఫెరెన్స్ హాలులో వర్సిటీ అధికారులతో సమావేశమయ్యారు. నన్నయ వర్సిటీలోని కోర్సులు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆచార్య ప్రసన్నశ్రీ వివరించారు. అత్యధిక అనుబంధ కళాశాలలు కలిగిన అతి పెద్ద యూనివర్సిటీగా శ్రీనన్నయశ్రీ ఉందని చెప్పారు. గోదావరి తీరాన, నన్నయ నడయాడిన నేలపై ఈ వర్సిటీ ఏర్పడం గొప్ప భాగ్యమని ఆచార్య మధుకర్భాయ్ హర్షం వ్యక్తం చేశారు. గిరిజన జీవనశైలి, విద్య వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. ఉభయ యూనివర్సిటీలు విద్యా, పరిశోధనా ప్రాజెక్టుల వంటి అంశాలపై ఒప్పందం కుదుర్చుకోవచ్చని చెప్పారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్ కూడా పాల్గొన్నారు.
రికార్డుల నిర్వహణలో లోపాలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రికార్డుల నిర్వహణలో అధికారులు, సిబ్బంది పనితీరు లోపభూయిష్టంగా ఉందని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. రబీ ధాన్యం సేకరణపై సమన్వయ శాఖల అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ధాన్యం సేకరణకు రూపొందించుకున్న కార్యాచరణ ప్రణాళిక, ఆచరణలో అధికారుల పాత్ర, పర్యవేక్షణపై ప్రశ్నించారు. మండలాలు, రైతు సేవా కేంద్రాల పరిధిలో ఏయే రకాల ధాన్యం సాగు చేశారు, వాటిలో ఏ రకం ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం సేకరించాలనే విషయాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. కోతలు పూర్తయిన తర్వాత ఎన్ని రోజులకు మిల్లింగ్‌కు అవకాశం ఉంటుందని ప్రశ్నించారు. సూపర్, కామన్, ప్రీమియం వైరెటీ రకాల్లో వేటికి బహిరంగ మార్కెట్‌లో డిమాండ్ ఉందో గమనించాలన్నారు. ఈ–క్రాప్ బుకింగ్ ఆధారంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారో లేదో క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతికూల వార్తలు వచ్చాయి కాబట్టి క్షేత్ర స్థాయి తనిఖీలు చేస్తామనే విధానం సరికాదని, నిరంతరం తనిఖీలు జరగాలని, తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రతి రోజూ రైతు సేవా కేంద్రాలను తనిఖీ చేయాలని అన్నారు. జిల్లా వ్యవసాయ, సహకార అధికారులు, నియోజకవర్గ ప్రత్యేకాధికారులకు ఒక్కో నియోజకవర్గ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడుకు ప్రశాంతి సూచించారు.
సీహెచ్‌ఓల వినూత్న నిరసన
రాజమహేంద్రవరం రూరల్: తమ న్యాయమైన డిమాండ్లను కూటమి ప్రభుత్వం కళ్లుండీ చూడటం లేదని, చెవులుండీ వినడం లేదని, నోరుండీ మాట్లాడటం లేదని పేర్కొంటూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (సీహెచ్‌ఓ) కళ్లు, చెవులు, నోరు మూసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. నిరవధిక సమ్మెలో భాగంగా ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అసోసియేషన్ ఆధ్వర్యాన సీహెచ్‌ఓలు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరసన మంగళవారం 9వ రోజుకు చేరుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేంత వరకూ సమ్మె ఆపేది లేదని స్పష్టం చేశారు. ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న సీహెచ్‌ఓలను క్రమబద్ధీకరించాలని, విలేజ్ క్లినిక్ అద్దె బకాయిలు, విద్యుత్ బిల్లులు వెంటనే చెల్లించాలని నినదించారు. అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టి.మమత మాట్లాడుతూ, సీహెచ్‌ఓలకు ఉద్యోగ భద్రత కల్పించే వరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

నన్నయను సందర్శించిన గుజరాత్ వీసీ

నన్నయను సందర్శించిన గుజరాత్ వీసీ