– జేఎన్‌టీయూకే వీసీ డాక్టర్ ప్రసాద్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సీ్త్రలను గౌరవించినప్పుడే సంపూర్ణ మహిళా సాధికారిత సాధ్యమవుతుందని జేఎన్‌టీయూకే వీసీ డాక్టర్ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్ పేర్కొన్నారు. జేఎన్‌టీయూకేలో వుమెన్ ఎంపవర్‌మెంట్ గ్రీవెన్స్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద్ మాట్లాడుతూ కాలం ఎంతో విలువైందని, మహిళలు తమ కంటూ లక్ష్యం ఏర్పరచుకుని ఆ లక్ష్యాన్ని చేరేవరకూ నిరంతరం శ్రమించాలన్నారు. ఫిలిప్పీన్ దేశ జనభాలో అత్యధికంగా మహిళలే ఉద్యోగం చేస్తున్నారన్నారు. మహనీయులను ఆదర్శంగా తీసుకుని నలుగురికి ఉపయోగపడేలా సేవలందిస్తూ ఉన్నత శిఖారాలు అధిరోహించాలన్నారు. వర్సిటీలో మహిళ సాఽధికారిత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని, మహిళలు విద్యార్థి దశలో విద్యకు అధిక ప్రాధాన్యమివ్వడంతో పాటు ఇతరులకు విద్యపట్ల అవగాహన కల్పించాలన్నారు. మరో ముఖ్య అతిథి నన్నయ వర్సిటీ వీసీ ప్రసన్నశ్రీ మాట్లాడుతూ సమాజంలో మహిళను బలపరిస్తే ఆమె ఒక కుటుంబాన్ని బలపరుస్తుందని, ఒక కుటుంబం బలంగా ఉంటే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. సమాజంలో ప్రతి మనిషికి ఆత్మ గౌరవం ఉంటుందని,మహిళలు ఆ ఆత్మగౌరవంతో అవకాశాలు చేజిక్కించుకోవాలన్నారు. అనంతరం లక్ష్మీ ఫౌండేషన్ ద్వారా ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు రూ.20వేలు ఉపకార వేతనం ఇస్తుండగా వచ్చే విద్యాసంవత్సరం ప్రతి విద్యార్థికి స్కాలర్ షిప్ ఇవ్వడానికి ముందుకు రావడంపై అభినందించారు. అనంతరం నన్నయ వీసీ ప్రసన్నశ్రీని సత్కరించారు. రెక్టార్ కేవీ రమణ, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ రవీంద్రనాథ్, డైరెక్టర్ రత్నకుమారి పాల్గొన్నారు.