కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మహిళలకు చట్టాలపై అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.శ్రీలక్ష్మి, ఎస్పీ డి.నరసింహ కిశోర్ అన్నారు. తద్వారా పని చేసే కార్యాలయాలు, ప్రాంతాల్లో మహిళలపై లైంగిక వేధింపులు జరగకుండా చూడవచ్చన్నారు. అంతర్జాతీయ మహిళా వారోత్సవాల సందర్భంగా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన ఎస్పీ కార్యాలయంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీలక్ష్మి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, వృద్ధులకు ఉచిత న్యాయ సేవలందించే ఆశయంతో ఏర్పాటు చేసిన డీఎల్‌ఎస్‌ఏపై ఆయా వర్గాలకు అవగాహన కల్పించి, న్యాయం చేకూరే విధంగా కృషి చేయాలని మహిళా రక్షక్ కానిస్టేబుళ్లకు సూచించారు. ఎస్పీ నరసింహ కిషోర్ మాట్లాడుతూ, అనుకోని సంఘటన జరగక ముందే, ముందు జాగ్రత్తగా అనుమానితులను మహిళా రక్షక్ కానిస్టేబుళ్లు హెచ్చరించాలని అన్నారు. మహిళల రక్షణ కోసం జిల్లాలో ప్రత్యేక మహిళా రక్షక దళం ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ అధికారి కె.విజయ్‌కుమారి మాట్లాడుతూ, అనాథ పిల్లల, మహిళలకు ప్రతి మండలంలో తమ సిబ్బంది రక్షణ కల్పిస్తున్నారని అన్నారు.