దళితులు తలెత్తుకునేలా జగన్‌ పాలన | - | Sakshi
Sakshi News home page

దళితులు తలెత్తుకునేలా జగన్‌ పాలన

Mar 11 2024 5:55 AM | Updated on Mar 11 2024 5:55 AM

- - Sakshi

హోం మంత్రి తానేటి వనిత

కానూరులో దళితుల ఆత్మీయ సమ్మేళనం

వేలాదిగా తరలివచ్చిన ప్రజలు

పెరవలి: దళితులను చంద్రబాబు అణచివేస్తే.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారి చేయి పట్టుకుని అభివృద్ధి వైపు నడిపించారని హోం మంత్రి, వైఎస్సార్‌ సీపీ గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ తానేటి వనిత అన్నారు. ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌నాయుడు ఆధ్వర్యాన నిడదవోలు నియోజకవర్గ దళితుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పెరవలి మండలం కానూరులో నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన దళితులు ఆద్యంతం జై జగన్‌ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ, సీఎం జగన్‌ అమలు చేసిన నవరత్నాల పథకాలు దళితుల ఇంట వెలుగులు నింపాయని అన్నారు. ఆయన పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు ఎంతో మేలు జరిగిందనడానికి ఇక్కడకు వచ్చిన ప్రజలే సాక్ష్యమని చెప్పారు. ‘మీ ఇంటికి మేలు జరిగిందంటేనే నాకు ఓటేయండి.. లేదంటే వద్దు’ అని ధైర్యంగా చెప్పిన నాయకుడు సీఎం జగన్‌ అని అన్నారు. శాసన మండలి చైర్మన్‌, హోం మంత్రి, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల్లో దళితులకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రతి సంక్షేమ పథకంలో 80 శాతం ఎస్సీలకు అందిస్తున్నారని వివరించారు. ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా.. అని అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. ఎస్సీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నింటినీ చంద్రబాబు కాలరాశారన్నారు. ఇవి పేదలకు, పెత్తందార్లకు మధ్య జరిగే ఎన్నికలని, అందుకు మనమంతా సిద్ధమా అని మంత్రి అనగా, సభ చప్పట్లతో మార్మోగిపోయింది. మూడు పార్టీలు ముచ్చటగా కలసి వస్తున్నాయని, అదే సమయంలో సీఎం జగన్‌ సింహంలా సింగిల్‌గా వస్తున్నారని, ఆయనకు అందరూ అండగా నిలవాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయం 175 స్థానాల్లో ఖాయమని, వార్‌ వన్‌ సైడ్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దళితుల ఆకలి తీర్చే జగన్‌ కావాలో.. మోసం చేసే చంద్రబాబు కావాలో ఆలోచన చేయాలని మంత్రి వనిత కోరారు.

వైఎస్సార్‌ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ, నీతికి, నిజాయితీకి మారు పేరయిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌నాయుడును మరోసారి గెలిపించుకుంటే నిడదవోలు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. పేదల కోసం ఏర్పడిన వైఎస్సార్‌ సీపీని రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ఐదేళ్లలో సీఎం జగన్‌ దళితుల కోసం రూ.76 వేల కోట్లు ఖర్చు చేశారని, అదే చంద్రబాబు రూ.30 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, దీనినిబట్టి దళితులను ఎవరు అక్కున చేర్చుకున్నారో అర్థం చేసుకోవాలని కోరారు.

టీడీపీ.. భూస్వాముల పార్టీ

టీడీపీ భూస్వాముల పార్టీ అని, వైఎస్సార్‌ సీపీ పేదల పార్టీ అని, దీనికి అందరం అండగా ఉండాలని ఎమ్మెల్యే శ్రీనివాస్‌నాయుడు అన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యిన తరువాత నియోజకవర్గాన్ని రూ.700 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్పారు. చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకుని తిన్నారని, రోడ్లు, డ్రెయిన్లు టీడీపీ నాయకుల ఇళ్ల వద్దే నిర్మించుకున్నారని అన్నారు. తన హయాంలో దళితవాడలను అభివృద్ధి వైపు నడిపించానని, ఉండ్రాజవరం మండలం వడ్లూరు దళితుల కోసం రూ.6 కోట్లతో వంతెన నిర్మిస్తున్నామని ఇలా గతంలో ఎవరూ చేయలేదని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌, నేతల నాని, గుల్లా ఏడుకొండలు, కె.బసవరావు, జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పొట్టి రాంబాబు, నిడదవోలు నియోజకవర్గ పరిశీలకుడు చీర్ల రాధయ్య, ఎంపీపీ కార్చెర్ల ప్రసాద్‌, పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మానుకొండ చంద్రబాబు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కాలాబత్తుల సుజాత, రాష్ట్ర ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ దొడ్డిగర్ల స్వాతి, డివిజన్‌ ఇన్‌చార్జి గెద్దాడ విమలమ్మ తదితరులు పాల్గొన్నారు.

1
1/1

Advertisement
 
Advertisement
Advertisement