భక్తుల ఇబ్బందులు పునరావృతం కానివ్వం | - | Sakshi
Sakshi News home page

భక్తుల ఇబ్బందులు పునరావృతం కానివ్వం

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

మందపల్లి ఈఓ సురేష్‌బాబు

కొత్తపేట: మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) క్షేత్రంలో శనివారం భక్తులు ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని దేవదాయ, ధర్మదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, ఈఓ దారపురెడ్డి సురేష్‌బాబు తెలిపారు. భక్తులు ఎదుర్కొన్న సమస్యలపై పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలపై ఆదివారం ఆయన దేవస్థానం మాజీ చైర్మన్‌ చింతం విజయకృష్ణమోహన్‌, పాలకమండలి సభ్యులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శనివారంతో పాటు శని జయంతి, శని అమావాస్య కలసిరావడంతో అంచనాకు మించి భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఈ పరిస్థితి ఎదురైందన్నారు. ముఖ్యమైన రోజుల్లో దేవాలయ ప్రాంగణం వెనుక సుమారు 1.20 ఎకరాల స్థలంలో భక్తులు పూజలు నిర్వహించి అక్కడి నుంచే క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనం చేసుకునేవారని తెలిపారు. అయితే ఆ స్థలంలో గోదావరి పుష్కర అభివృద్ధి పనులు ప్రారంభించామని, పూజలకు కేవలం ఆలయ ప్రాంగణం మాత్రమే ఉన్నందున, స్థానిక హైస్కూల్‌ మైదానంలో పూజల నిర్వహణకు, అనంతరం ఆలయం ముందు నుంచే దర్శనానికి ఏర్పాట్లు చేశామన్నారు. అయినప్పటికీ కొందరు వ్యక్తులు దేవస్థానంపై బురదజల్లే ప్రయత్నంలో ఇక్కడ తలెత్తిన పరిస్థితిని అతిగా చూపి సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేశారని దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, ఈఓ పేర్కొన్నారు. రానున్న జూన్‌ 13, 27 తేదీల్లో శని త్రయోదశి పర్వదినాలు ఉన్నందున భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

టిప్పర్‌ ప్రమాద బాధితులకు

తక్షణ ఆర్థిక సాయం

ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ డిమాండ్‌

జీజీహెచ్‌లో క్షతగాత్రులకు పరామర్శ

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ రూరల్‌ కొవ్వూరు బైపాస్‌ రోడ్డులో శనివారం జరిగిన టిప్పర్‌ ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి కూలీల కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక ఆర్థిక సాయం అందజేయాలని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ డిమాండ్‌ చేశారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను, మృతుల కుటుంబ సభ్యులను ఆదివారం ఆయన పరామర్శించి, ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మృతుల కుటుంబాలు నిరుపేద, బడుగు వర్గాలకు చెందిన వారు కావడంతో, ప్రభుత్వం ఉదారంగా, మానవతా దృక్పథంతో తక్షణ ఆర్థిక సాయం ప్రకటించాలని కోరారు. క్షతగాత్రులకు ఎలాంటి లోటూ లేకుండా మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ఘోర ప్రమాదాలు పునరావృతం కాకుండా ఉండేందుకు రోడ్డు భద్రత విషయంలో అధికారులు అత్యంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని, తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, తగిన చర్యలు చేపట్టాలని బోస్‌ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement