అయినవిల్లి: సమస్త విఘ్నాలనూ తొలగించే అయినవిల్లి విఘ్నేశ్వరస్వామిని ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యాన గణపయ్యకు మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, లఘున్యాస పూర్వక ఏకాదశ పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ నిర్వహించారు. స్వామివారిని సుగంధభరిత పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. మహానివేదన చేశారు. స్వామివారికి విశేష సేవల అనంతరం రాత్రి 8 గంటలకు ఆలయ తలుపులు మూసివేశారు. లఘున్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాల్లో 114 మంది, శ్రీలక్ష్మీ గణపతి హోమంలో 85 మంది పాల్గొన్నారు. గరిక పూజలో ఐదు జంటలు పాల్గొన్నాయి. ఐదుగురు భక్తులు ఉండాళ్ల పూజ చేశారు. ఇద్దరు చిన్నారులకు అక్షరాభ్యాసం, ఎనిమిది మంది చిన్నారులకు తులాభారం నిర్వహించారు. 42 మంది వాహన పూజలు చేయించుకున్నారు. స్వామివారి అన్నప్రసాదం 2,420 మంది స్వీకరించారు. వివిధ పూజా టికెట్లు, అన్నదాన విరాళాల ద్వారా స్వామివారికి రూ.4,26,660 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.
లక్ష పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): తక్షణమే జాబ్ క్యాలెండర్‌ను సవరించి, కనీసం లక్ష పోస్టులతో విడుదల చేయాలని డీవైఎఫ్‌ఐ తూర్పు గోదావరి జిల్లా కన్వీనర్ వి.రాంబాబు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తమను గెలిపిస్తే ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామంటూ గతంలో నిర్వహించిన యువగళం పాదయాత్రలో లోకేష్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దాదాపు రెండేళ్ల తర్వాత కేవలం 10,060 ఉద్యోగాలతో జాబ్‌లెస్ క్యాలెండర్ విడుదల చేసి, ఉగాది పండగ చేసుకోమని చెప్పడం న్యాయమా అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలున్నాయో ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. జాబ్ క్యాలెండర్‌లో 713 టీచర్ పోస్టులనే చూపించారని, రాష్ట్ర క్యాబినెట్ మాత్రం 2,260 పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తామంటూ జీఓ నంబర్ 13 విడుదల చేశారని అన్నారు. దీంతో నిరుద్యోగులు గందరగోళానికి గురవుతున్నారన్నారు. ఏటా డీఎస్సీ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఘనంగా ప్రకటించారని, ఫిబ్రవరి, మార్చి అని ఇప్పుడేమో ఏకంగా అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుందంటున్నారని రాంబాబు విమర్శించారు. జూన్‌లో రిటైరయ్యే వారిని దృష్టిలో ఉంచుకుని డీఎస్సీ పోస్టులు పెంచాలని, పీఈటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. పద్ధెనిమిదేళ్లుగా లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయడం లేదని, దీని కోసం 2 లక్షల మంది ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్‌లో 100 లైబ్రేరియన్ పోస్టులు మాత్రమే చూపారని, వీటిని కూడా పెంచాలని డిమాండ్ చేశారు. ఒక్క పోలీస్ కానిస్టేబుల్ పోస్టులే 10,762 ఉన్నాయంటూ శాసనసభలో హోం మంత్రి ప్రకటించారని, జాబ్ క్యాలెండర్‌లో మాత్రం 1,970 పోస్టులే చూపడం అన్యాయమని ఆయన విమర్శించారు. గ్రూప్–1, 2 ఉద్యోగాలు 5 వేలకు పైగా ఖాళీలుండగా జాబ్ క్యాలెండర్‌లో 841 మాత్రమే చూపారన్నారు. యూనివర్సిటీల్లో 4 వేలకు పైగా ఖాళీలున్నట్టు విద్యా శాఖ మంత్రి స్వయంగా ప్రకటించారని, జాబ్ క్యాలెండర్‌లో మాత్రం 1,500 పోస్టులే చూపడం దారుణమని అన్నారు. అన్ని రకాల గ్రూప్స్ పరీక్షలకు వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలని, డీఎస్సీకి 49, కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. కనీసం లక్ష పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనే డిమాండ్‌తో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహిస్తున్నామని, యువత, నిరుద్యోగులు దీనిని విజయవంతం చేయాలని రాంబాబు కోరారు.
కోటసత్తెమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. దేవస్థానం ఆధ్వర్యాన 50 లీటర్ల పెరుగుతో మజ్జిగ చలివేంద్రం నిర్వహించారు. దర్శనాలు, ప్రసాదం, పూజా టికెట్లు, ఫొటోల అమ్మకంతో రూ.1,40,454 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ తెలిపారు. కార్యక్రమాల్లో ధర్మకర్తల మండలి చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.


