ఫ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
ఫ నేరాల అదుపుపై సమీక్ష
అమలాపురం టౌన్: వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల సందర్భంగా జిల్లాలోని సముద్ర తీరం వెంబడి పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. పుష్కరాల సమయంలో తీరంలో నిత్యం బోట్లతో పెట్రోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఆయన విలేకర్లతో మాట్లాడారు. పోలీసు సిబ్బంది పరంగా ఉన్న కొరతను పుష్కరాల సమయానికి పూర్తిగా అధిగమిస్తామని చెప్పారు. రానున్న మూడు నెలల్లో శాఖా పరంగా పూర్తి స్థాయి మార్పు చూస్తారన్నారు, అంతకు ముందు నేరాల అదుపు, పుష్కరాల ఏర్పాట్లపై ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో డీజీపీ సమీక్షించారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీకే అశోక్ కుమార్, శాంతిభద్రతల విభాగం అడిషనల్ డీజీ మధుసూదనరెడ్డి, ఎస్పీ రాహుల్ మీనా, ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్ తదితరులతో ఈ సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల్లో పోలీసు బందోబస్తు ఎలా ఉండాలి.. ఎంత మంది పోలీసు సిబ్బంది ఉండాలి.. జిల్లాలోని పుష్కర ఘాట్ల పరంగా బందోబస్తు తదితర అంశాలపై చర్చించారు. పుష్కరాల సందర్భంగా ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలపై సమీక్షించారు. ఆర్టీసీ బస్సు ఏర్పాట్లపై చర్చించారు. పుష్కరాలకు ఎంత మంది పోలీసు సిబ్బందిని కొత్తగా రిక్రూట్ చేయాలనే అంశం అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో నేరాల అదుపునకు చేపట్టిన చర్యలను ఎస్పీ రాహుల్ మీనా డీజీపీకి వివరించారు. సమీక్షలో అమలాపురం, రామచంద్రపురం డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్, అమలాపురం పట్టణ సీఐ పి.వీరబాబు, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. తొలుత ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో డీజీపీ గుప్తా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎస్పీ నిర్వహించిన పలు వినూత్న కార్యక్రమాల ఫొటోలతో కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించి, అభినందించారు. ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.


